యువ భారత్‌ రెండో గెలుపు

6 Jan, 2020 03:30 IST|Sakshi

దివ్యాంశ్‌ సక్సేనా అజేయ సెంచరీ

డర్బన్‌ (దక్షిణాఫ్రికా): నాలుగు దేశాల అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో యువ భారత్‌ రెండో విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 89 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 301 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (86 బంతుల్లో 78; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దివ్యాంశ్‌ సక్సేనా (137 బంతుల్లో 128 నాటౌట్‌; 11 ఫోర్లు,  సిక్స్‌) అదరగొట్టారు. దివ్యాంశ్‌ అజేయ సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు.

కుమార్‌ కుశాగ్ర (51 బంతుల్లో 47; 2 ఫోర్లు) రాణించాడు. అనంతరం జింబాబ్వే జట్టు 49.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. డియాన్‌ మైర్స్‌ (108 బంతుల్లో 83; 9 ఫోర్లు, సిక్స్‌) జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా (3/37), శుభాంగ్‌ హెగ్డే (3/40) ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగే తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  నాలుగు దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దాదాపు ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.

మరిన్ని వార్తలు