ఉసురు తీసిన పింక్ నోటు

12 Dec, 2016 14:47 IST|Sakshi
కృష్ణ(పైల్‌)

సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న తాపీ మేస్త్రి మృతి
 
కిండ్ర (రాజవొమ్మంగి): పెద్ద నోట్ల రద్దు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటే, మరో వ్యక్తి జేబుకు చిల్లు పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో రూ.2 వేల నోట్లకు సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న ఓ తాపీమేస్త్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంగబోయిన కృష్ణ (45) వ్యవసాయంతో పాటు తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల కిందట తాను సాగు చేసిన పత్తి అమ్మగా రూ.2 వేల నోట్లు రెండు అందాయి. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న అతడు వైద్యం కోసం మైదాన ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆదివారం పగలంతా రూ.2 వేల నోట్లకు చిల్లర కోసం తిరిగాడు. ఆస్పత్రికి వెళ్లాలని, చిల్లర ఇప్పించాలని పలువురిని ప్రాధేయపడ్డాడు. చివరకు ఒక నోటుకు చిల్లర లభించింది. ఆ సొమ్ముతో కిండ్ర నుంచి తన మోటారు సైకిల్‌పై సాయంత్రం ఏలేశ్వరం వైపు పయనమయ్యాడు. అప్పటికే శ్వాస ఆడక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కృష్ణ ఊరి చివరకు వెళ్లేసరికే మోటారు సైకిల్‌పై నుంచి కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు
మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్‌ బ్యాంకులో రూ. 4 వేల  నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మధ్య ఉన్న జాయింట్‌ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు.

>
మరిన్ని వార్తలు