ఎన్‌సీఆర్‌పై ఆప్ కన్ను

11 Dec, 2013 23:28 IST|Sakshi

ఘజియాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో ఆరంభంలోనే అదరగొట్టిన సామాన్యుడి పార్టీ జాతీయ ప్రాదేశిక ప్రాంతం(ఎన్‌సీఆర్)లోనూ పట్టు బిగించడంపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఇక్కడ కూడా మంచి ఫలితాలను రాబట్టేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు చేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలను అధిగమించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోవాలని యోచిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ (నోయిడా), గుర్గావ్, ఫరీదాబాద్, మీరట్, జైపూర్‌కు చెందిన అనేక మంది ఆప్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఓటర్‌ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఆప్‌కు అనుకూలంగా మలచడంలో వీరు కీలకపాత్ర పోషించారు.
 
 ఇలాంటి వారు ఉంటున్న నగరాల్లో కొత్త పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తాయనే ప్రచారం ఊపందుకోంది. ఆయా నగరాల్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని ఆప్ కార్యకర్తలు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ, జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో తమ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆప్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏడు లోక్‌సభ సీట్లు ఉన్నాయని, జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ (నోయిడా), గుర్గావ్, ఫరీదాబాద్, మీరట్, జైపూర్, రోహతక్, హిస్సార్, కురుక్షేత్ర, సోనిపట్ స్థానాలు ఉన్నాయని అన్నారు. గౌతమ్‌బుద్ధ్ నగర్‌లో  ఇప్పటికే సాధారణ ఎన్నికలకు పార్టీ మద్ధతుదారులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు.
 
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన స్థానిక పార్టీ కార్యకర్తలకు నోయిడాకు చెందిన ఆప్ మద్దతుదారుడు అనూప్ ఖన్నా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రభావం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల హవాకు ఆప్ పార్టీ బ్రేకులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యుల ఆలోచన విధానాన్ని మార్చడంలో కేజ్రీవాల్ సఫలీకృతులయ్యారన్నారు. ఒకవేళ ఆప్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఢిల్లీతో పాటు జాతీయ ప్రాదేశిక ప్రాంత ఓటర్లు భారీ స్థాయిలో మద్దతు పలుకుతారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలో అన్నా హజారే దీక్ష చేసినప్పుడు నోయిడాకు నుంచి పదివేల మంది వెళ్లి మద్దతుగా నిలిచారని నోయిడా లోక్ మంచ్ ప్రధాన కార్యదర్శి మహేశ్ సక్సేనా అన్నారు. సామాజిక సమస్యలపై ఇంత మంచి అవగాహన ఉన్న ప్రజలు ఆప్ పోటీ చేస్తే అక్కున చేర్చుకుంటారన్నారు.
 

>
మరిన్ని వార్తలు