ఆర్టీఓలో ‘సింగిల్ విండో’

10 Aug, 2013 01:38 IST|Sakshi
 సాక్షి, ముంబై: దళారుల సాయం లేకుండా ‘లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్’ పొందేందుకు అంధేరి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) సింగిల్ విండో పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో లెసైన్స్ కావాలకునే అభ్యర్థులు ఆర్టీఓ కార్యాలయంలో పడిగాపులు పడాల్సిన అవసరంలేదు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారం సింగిల్ విండో కౌంటర్‌లో జమచేసి, రుసుం చెల్లిస్తే చాలు నిర్దేశించిన గడువులోపు  లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్‌‌స మీ చేతిలో ఉంటుంది. దీంతో అభ్యర్థులకు దళారుల బెడద నుంచి పూర్తిగా విముక్తి లభించనుంది. సాధారణంగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది...? దాన్ని ఎలా నింపాలి..? ఆ తర్వాత ఎక్కడ జమచేయాలి..? రుసుం ఏ కౌంటర్‌లో చెల్లించాలి..? తదితర  అనేక విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీంతో విలువైన సమయంతోపాటు ఉద్యోగులు పెట్టుకున్న సెలవు కూడా వృథా అవుతోంది. అయినప్పటికీ పనికాదు. 
 
 దీంతో విసుగెత్తిన సామాన్యులు ఈ తతంగం నుంచి తప్పుకునేందుకు నేరుగా దళారులను ఆశ్రయిస్తున్నారు. అందుకు వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ ఈ పనులపై కొంత అవగాహన ఉన్నవారు నేరుగా అక్కడ పనిచేసే అధికారి లేదా  క్లర్క్, ప్యూన్ దగ్గరికి వెళితే దళారి సాయం లేకుండా నేరుగా వచ్చినందుకు కొంత చిన్నచూపు చూస్తారు. పలుమార్లు తిప్పించుకుంటారు. ఇక అలాంటి వాటికి స్వస్తి చెప్పేందుకు ఈ సింగిల్ విండో పథకాన్ని ప్రారంభించినట్లు అంధేరి ఆర్టీఓ అధికారి భరత్ కలస్కర్ చెప్పారు. ఆర్టీఓ కార్యాలయానికి అభ్యర్థి రాగానే దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయి..? ఎలా వెళ్లాలి..? తదితర వివరాలు తెలియజేసేందుకు అక్కడ సిబ్బందిని నియమిస్తారు. అక్కడ గోడపై నమూనా ఫారం ఉంటుంది. దాన్ని చూస్తూ దరఖాస్తు ఫారం నింపడమే. ఆ తరువాత దాన్ని సింగిల్ విండో కౌంటర్‌లో జమచేస్తే అక్కడే రుసుం తీసుకుంటారు.
 
 అనంతరం కంప్యూటర్‌లో వాహనం ఎలా నడపాలో కొద్దిగా శిక్షణ ఇస్తారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు గంటల్లో ఎంపికైనట్లు అభ్యర్థుల పేర్లు స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. అనంతరం లెర్నింగ్ డ్రైవింగ్ లెసైన్స్ జారీ అవుతుందని కలస్కర్ చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు దూరమవుతాయన్నారు.
 
 అంతేగాక అటు దళారుల ఆగడాలకు, ఇటు ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పూర్తిగా కళ్లెం వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ సఫలీకృతమైతే నగరంలోని మిగతా ఆర్టీఓ కార్యాలయాల్లో సింగిల్ విండో పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.  
>
మరిన్ని వార్తలు