సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం

Published Sat, Aug 10 2013 1:44 AM

For irrigation farmer to commit suicide

 పెరికీడు (హనుమాన్‌జంక్షన్ రూరల్), న్యూస్‌లైన్ :  సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దశలో ఉద్రేకానికి లోనైన ఓ రైతు పురుగుమందుతో ఆత్మహత్యకు యత్నించగా, డబ్బా పగిలి ముగ్గురి కళ్లలో పడింది. వివరాల్లోకెళితే.. బాపులపాడు మండలం కాకులపాడు, దంటగుంట్ల, రామన్నగూడెం తదితర గ్రామాల రైతులు సాగునీటి ఎద్దడి కారణంగా ఆకుమళ్లు ఎండిపోతున్నాయని పెరికీడు వద్ద తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, రైతులు మచిలీపట్నం కల్లూరు రహదారిపై నిరసన ప్రదర్శన, రాస్తారోకోకు దిగారు. 
 
సాగునీరు విడుదల విషయమై ఇరిగేషన్ డీఈ, ఎస్‌ఈలతో చలసాని ఫోన్‌లో మాట్లాడి ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా, రైతులు కచ్చితమైన హామీ ఇచ్చేవరకు అక్కడినుంచి కదిలేది లేదని చలసానిని కూడా చుట్టుముట్టారు. రాస్తారోకో కారణంగా రాకపోకలు నిలిచిపోవడంతో హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ బి.ప్రభాకరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని రాస్తారోకోకు కారకులైన చలసానితో పాటు మరో పదిమంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కాకులపాడుకు చెందిన రైతు బట్టు ఏసోబు సాగునీరు విడుదల చేయరు, పంటలు పండవు, ఇక రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ తన వద్ద ఉన్న ఎండోసల్ఫాన్ డబ్బా బయటకు తీసి తాగడానికి సిద్ధపడ్డాడు. 
 
రైతులు డబ్బా లాక్కోవడానికి ప్రయత్నించగా, అది పగిలి యలమంచిలి శేషయ్య, చెక్కా శ్రీను, బట్టు సామియేలు అనే ముగ్గురు రైతుల కళ్లలో పడింది. దీంతో వారిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చలసాని అరెస్టు వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కాలువ రెండడుగులు ఎత్తు పెంచనున ్నట్లు ఇరిగేషన్ ఏఈ ప్రసాదరావు వచ్చి ఎమ్మెల్యే దాసరికి హామీ ఇచ్చారు. 1200 క్యూసెక్కుల నీరు వదిలితేగాని రైతులకు సాగునీరు అందదని, ఇప్పుడు కేవలం 800 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపిణీ చేస్తున్నారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టమైన ప్రకటన చేసేవరకు పోలీస్‌స్టేషన్‌ను వీడేది లేదని తేల్చిచెప్పిన రైతులు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. చర్చలు   కొనసాగుతున్నాయి.
 

Advertisement
Advertisement