ఈయూలో ముదిరిన విభేదాలు | Sakshi
Sakshi News home page

ఈయూలో ముదిరిన విభేదాలు

Published Sat, Aug 10 2013 1:46 AM

Advanced differences between RTC employees union

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)లో విభేదాలు ముదిరాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలతో కలిసి ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ స్థానిక అధికారులకు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చింది. ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. చంద్రశేఖరరెడ్డి సీమాంధ్ర పోరాట కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. అయితే.. ఆర్టీసీ నష్టాలు, ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె నుంచి ఈయూను మినహాయించాలని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ శుక్రవారం ఏపీఎన్జీవోలకు లేఖ రాశారు. ఆర్టీసీ ఇప్పటికే రూ.5 వేల కోట్ల నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. నష్టాలు అధికమైతే.. ఉద్యోగుల జీతభత్యాల పెంపుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.
 
  ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేళ్లు అమలు కావాల్సి ఉందని, ఈ నేపథ్యంలో సమ్మె ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెడుతుందన్నారు. ఆర్టీసీని అత్యవసర సేవలుగా భావించాలని, బస్సుల రాకపోకలు నిలిచి పోతే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని తొలి దశ సమ్మె నుంచి మినహాయించాలన్నారు. సమ్మె నిరవధికంగా కొనసాగితే.. మలిదశలో తప్పక ఈయూ పాల్గొంటుందని స్పష్టం చేశారు. కాగా, సమ్మె ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఏపీఎన్జీవోలు సమ్మెకు దిగిన మరుక్షణం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఈయూ కార్మికులు సమ్మెకు వెళతారన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలతోపాటు ఆర్టీసీకి కూడా కొన్ని ప్రత్యేక సమస్యలు వస్తాయని, అందుకే విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Advertisement
Advertisement