బెంగళూరు నుంచి తిరుమలకు ప్యాకేజీ

5 May, 2017 21:52 IST|Sakshi
బెంగళూరు నుంచి తిరుమలకు ప్యాకేజీ

బెంగళూరు :
పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండేలా బెంగళూరు నుంచి తిరుపతికి ప్యాకేజ్‌ టూర్‌ ఏర్పాటుచేసేందుకు కర్ణాటకరాష్ట్ర ఆర్టీసీతో ఏపీ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈమేరకు బెంగళూరు కేఎస్‌ఆర్‌టీసీ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఆర్‌.ఉమాశంకర్, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హిమాంశు శుక్ల ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. బెంగళూరు–తిరుమల మధ్య ప్యాకేజ్‌ టూర్‌ను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ ప్యాకేజ్‌ ద్వారా పర్యాటకులకు అమరావతి మల్టీ యాక్సల్‌ బస్సు సదుపాయం, హోటల్‌లో కాలకృత్యాలు, అల్పాహారం, భోజనంతో పాటు తిరుమలలో తక్షణ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయి. బెంగళూరు నుంచి రోజూ రాత్రి 10 గంటలకు బయల్దేరే ఈ సర్వీస్‌ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది.

శుక్ర, శనివారాల్లో పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 టికెట్‌ ధరగా నిర్ణయించారు. మిగతా రోజుల్లో పెద్దలకు రూ.2000 పిల్లలకు రూ.1700 టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. కేఎస్‌ఆర్‌టీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, ప్రైవేట్‌ బుకింగ్‌ కేంద్రాల ద్వారా, ఆన్‌లైన్, మొబైల్‌ ఫోన్‌ ద్వారా 30 రోజుల ముందుగానే టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. కార్యక్రమంలో కేఎస్‌ఆర్‌టీసీ డైరెక్టర్‌ బీఎన్‌ఎస్‌ రెడ్డి, ట్రాఫిక్‌ జనరల్‌ మేనేజర్‌ కేఎస్‌ విశ్వనాథ్, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ జనరల్‌ మేనేజర్‌ జిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 7760990034, 7760990035 మొబైల్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు