బంగాళాఖాతంలో రోబోట్

16 Jun, 2016 01:53 IST|Sakshi

* ప్రకృతి వైపరీత్యాల సమాచారం కోసం ఏర్పాటు
* భారత్-ఇంగ్లండ్ శాస్త్రవేత్తల సంయుక్త ప్రణాళిక
* 24న చెన్నై నుంచి సముద్రంలో శాస్త్రవేత్తల పర్యటన

సాక్షి ప్రతినిధి, చెన్నై: సముద్రంలో చోటుచేసుకునే ప్రకృతి వైపరీత్యాలను మరింత ముందుగా పసిగట్టేందుకు బంగాళాఖాతం గర్భంలో రోబోట్‌లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం అవుతోంది. ఈ ప్రణాళిక అమలులో భాగంగా భారత్, ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల బృందం సముద్రంలో పర్యటించనుంది.

ఈనెల 24వ తేదీన చెన్నైలో వారి ప్రయాణం ప్రారంభం కానుంది.   సముద్రంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, భూకంపాల ప్రభావాలతో భారీ వర్షాలు, ఉప్పెనలు చోటుచేసుకుంటాయి. మోతాదుకు మించి కురిసే వర్షాల వల్ల భారీ నష్టం సంభవిస్తోంది. సముద్రంలోని వాయుగుండం, అల్పపీడనాల తీవ్రతను సరిగ్గా లెక్కకట్టి ముందుగానే హెచ్చరించేందుకు వీలైన విధానానికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు.

ఇందుకోసం సముద్ర గర్భంలో సశాస్త్రీయమైన రోబోట్‌ను అమరుస్తారు. సముద్రపు అడుగుభాగంలో తుపాను, వాయుగుండం, అల్పపీడనద్రోణిలకు దారితీసే తీవ్రతలను ఈ రోబోట్ ముందుగానే పసిగట్టి సంబంధిత కార్యాలయానికి చేరవేస్తుంది. రోబోట్ నుంచి అందే సమాచార తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది.

భారత్‌లోని బే ఆఫ్ బెంగాల్ లార్జ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ప్రాజెక్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు రోబోట్ అమర్చే ప్రక్రియను చేపడుతున్నారు. వీరితోపాటు ఇంగ్లాండ్‌కు చెందిన తూర్పు ఆంగ్లియా యూనివర్సిటీ, సౌత్ ఆమ్డన్‌లోని జాతీయ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పథకంలో భాగస్వామ్యులు అవుతున్నారు. సింధూ సాధన అనే భారత పరిశోధన నౌకలో భారత్‌తోపాటు ఆయా దేశాల శాస్త్రవేత్తల బృందం బయలుదేరుతుంది. శాస్త్రవేత్తల బృందం ఈనెల 24వ తేదీన చెన్నై నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని భౌగోళిక విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు