బెంగళూరులో ఇక స్మార్ట్‌ పార్కింగ్‌

14 Aug, 2017 19:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మెట్రో పాలిటన్‌ నగరాల్లో నేడు పార్కింగ్‌ సమస్య పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెల్సిందే. ఎక్కడ మోటారు బైక్‌ను ఆపాలో, ఎక్కడ కారు పార్కింగ్‌ చేయాలో తెలియక నగర జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు బహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) త్వరలో స్మార్ట్‌ పార్కింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అభివద్ధి చేసింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు పార్కింగ్‌ సమస్య తీరినట్లే. యాప్‌ ద్వారా ఎక్కడ పార్కింగ్‌ స్థలం ఉందో, అందులో ఎన్ని ఖాళీ స్లాట్‌లు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్‌గా కూడా పార్కింగ్‌ స్థలాన్ని బుక్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ పార్కింగ్‌ విధానం కింద నగరంలో 85 ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్‌ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్లపై నిఘా ఉంచేందుకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. సెన్సర్ల ద్వారా ఏ కారు ఎన్నిగంటలకు వచ్చిందో, ఎన్నిగంటలకు వెళుతుందో గుర్తించవచ్చు. ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారా పార్కింగ్‌ చార్జీలు చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపొచ్చు. టూ వీలర్‌ బైకులకు, కార్లకు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తారు.

నగరంలో పార్కింగ్‌ స్థలాలను ఏ, బీ, సీ అంటూ మూడు కేటగిరీలుగా విభజిస్తున్నారు. కేటగిరీని బట్టి పార్కింగ్‌ చార్జీలు మారుతుంటాయి. తొలుత మూడువేల కార్లు, ఆరువేల మోటారు బైకులకు పార్కింగ్‌ స్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతాన్నిబట్టి అక్కడి పార్కింగ్‌ స్థలాన్ని, అందులోని ఖాళీ స్లాట్లను యాప్‌ ద్వారా ముందుగా గుర్తించవచ్చు. అవసరమైతే అడ్వాన్స్‌గా బుకింగ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు