ఇంటికో కేజీ బంగారం ఇస్తామంటారేమో!: వైఎస్‌ జగన్‌

14 Aug, 2017 19:25 IST|Sakshi
ఇంటికో కేజీ బంగారం ఇస్తామంటారేమో!: వైఎస్‌ జగన్‌

- సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత విసుర్లు
- పాపాన్ని గెలిపించాలని అడిగేవారు దెయ్యాలే
-
ఓటుతో దుష్ట పాలనకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపు
- నంద్యాల  ఉపఎన్నిక: ఆరో రోజు ప్రచారం

నంద్యాల:
ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తొస్తారని, మూడేళ్ల కిందట ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకపోగా, కొత్త హామీలిస్తూ నంద్యాల ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆరో రోజు నంద్యాల పట్టణంలో ఆయన పర్యటించారు. స్థానిక గిరినాథ్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుతో 21 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు .. ప్రజలను కూడా కొనేయొచ్చనే అహకారంతో వస్తున్నారని జగన్‌ మండిపడ్డారు.

"గడిచిన మూడేళ్లలో కర్నూలు జిల్లానుకానీ, నంద్యాలనుకానీ ముఖ్యమంత్రి, కేబినెట్‌ మంత్రులు  పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఇక్కడే మకాం వేశారు. కారణం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోటీలో పెట్టినందుకే. ఒకవేళ వైఎస్సార్‌సీపీ పోటీకి దిగకపోయి ఉంటే, ఇన్ని నిధులుకానీ, ఇన్ని శంకుస్థాపనలుగానీ జరిగేవికావు. దీని ద్వారా మనకో విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు' అని జగన్‌ గుర్తుచేశారు.

ఇంటికో కేజీ బంగారం, స్విఫ్ట్‌ కారు ఇస్తామంటారేమో!
గడిచిన మూడేళ్లుగా చంద్రబాబుగారు ఇసుక దందా, లిక్కర్‌ మాఫియా, రాజధాని భూములు.. ఇలా ఏదిపడితే దాంట్లో అక్రమంగా సంపాదించారు. ఆ సొమ్ముతో 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడు నంద్యాలలో గెలుపు కోసం ఇంటికో బంగారమో, ఇంటికో స్విఫ్ట్‌కారో ఇస్తామని అంటారేమో! మనిషికో రూ.5వేలు చేతిలో పెట్టి, జేబులో నుంచి దేవుడి ఫొటో తీసి.. ఓటు వేయాల్సిందిగా ప్రమాణం చేయించుకుంటున్నారు టీడీపీ నాయకులు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం.. పాపాన్ని గెలిపించాలని కోరేది దెయ్యాలు మాత్రమే! దేవుళ్లు కానే కాదు" అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఓటుతో దుష్ట పాలనకు బుద్ధిచెప్పండి
సరిగ్గా మూడేళ్ల కిందట.. 2014, ఆగస్టు 15న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కర్నూలులో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంలో ఆయన కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను వైఎస్‌ జగన్‌ ప్రజలకు గుర్తుచేశారు. "జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ కడతామని, ట్రిపుల్‌ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, అవుకు దగ్గర ఇండస్ట్రియల్‌ పార్క్‌, మైనింగ్‌, ఫుడ్‌ పార్కులు, సిమెంట్‌ ఫ్యాక్టరీ, గండ్రేవుల ప్రాజెక్టు.. ఇలా బోలెడు చెప్పారు. కానీ వీటిలో కనీసం ఒక్కటైనా అమలులోకి రాలేదు. జిల్లా వాసులుగా మీ అందరికీ ఈ సంగతులు తెలుసు. రైతులు మొదలుకొని డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. సమాజంలోని అన్ని రంగాల వారినీ చంద్రబాబు నిలువునా మోసం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని, జాబు రాకుంటే ఇంటికో రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పట్టించుకోలేదు. మూడేళ్ల దుర్మార్గ పాలనకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది. నంద్యాల ప్రజలు వేసే ఓటు.. చంద్రబాబు పరిపాలను చెంపపెట్టులా ఉండాలి" అని వైఎస్‌ జగన్‌ అన్నారు.