రోడ్డుపై బస్సు నిలిపి డ్రైవర్‌ పరార్‌

13 Sep, 2017 07:16 IST|Sakshi
డ్రైవర్‌ రోడ్డుపై వదిలివెళ్లిన బస్సు

ప్రయాణికుల ఇబ్బందులు
గుండెనొప్పితో ఆస్పత్రికి వెళ్లినట్టు అధికారుల వివరణ


తిరువొత్తియూరు : కొడైకెనాల్‌కు వెళుతున్న బస్సును అర్ధాంతరంగా రోడ్డుపై నిలిపి డ్రైవర్‌ వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దిండుకల్‌ నుంచి కొడైకెనాల్‌కు సోమవారం ఉదయం ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఈ బస్సులో 50మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్‌ అడ్డదిడ్డంగా నడుపుతున్నట్టు తెలిసింది. దీంతో ప్రయాణికులు దిగ్భ్రాంతి చెందారు. ఈ లోపు బస్సు దేవదానపట్టి, గెంగువార్‌పట్టి ఘాట్‌రోడ్డు వద్ద వెళుతోంది. డ్రైవర్‌లో మితమైన వేగంతో బస్సును నడపాలని ప్రయాణికులు సూచించారు.

తరువాత కూడా డ్రైవర్‌ బస్సును వేగంగా నడపడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కగా నిలిపి కిందకు దిగి పరుగున్న వెళ్లి ఆ మార్గంగా వస్తున్న మరో ప్రభుత్వ బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారు కండక్టర్‌ వద్ద మొరపెట్టుకోవడంతో అతను రవాణసంస్థ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను పంపించమని కోరాడు.

సుమారు రెండు గంటల తరువాత మరో డ్రైవర్‌ వచ్చి బస్సును నడిపారు. దీనిపై రవాణ సంస్థ అధికారి మాట్లాడుతూ ఆరోగ్యం సరిలేక పోవడం వల్ల డ్రైవర్‌ అర్ధాంతరంగా బస్సును రోడ్డుపై నిలిపి వెళ్లాడని, అతనికి ఇంతకుముందు గుండెనొప్పి వచ్చి ఉన్నట్టు తెలిపారు. దీని వల్ల ముందు జాగ్రత్తగా బస్సును నిలిపి మరో బస్సులో ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు