పడిగాపులు

1 Jul, 2014 23:45 IST|Sakshi

తమ వాళ్ల కడచూపు కోసం రాయపేట మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. మృత దేహాలను గుర్తించడం, పోస్టుమార్టం, సమగ్ర విచారణ అనంతరం అప్పగించడంలో జాప్యం నెలకొంటోంది. దీంతో మార్చురీ వద్ద ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగి ఉన్నాయి.
 
 సాక్షి, చెన్నై:మౌళివాకం ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయానికి 27 మృతదేహాలను ఆ మార్చురీకి తరలించారు. అయితే, కొన్ని మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో గుర్తించడం కష్టతరంగా మారుతోంది. తమ వాళ్ల కోసం మార్చురీ వద్దకు పరుగులు తీస్తున్న వాళ్లకు ఆ మృతదేహాలను చూపిస్తున్నారు. అయితే, గుర్తించడం కష్టతరం అవుతుండడంతో కొన్ని మృతదేహాల ఆచూకీ, వివరాలు కనుగొనడంలో ఆటంకం ఏర్పడుతోంది. అదే సమయంలో తమ వాళ్లు మరణించారన్న సమాచారం ఉన్నా,
 
 వారి మృతదేహాలు రాయపేటలో ఉన్నాయా? కేఎంసీలో ఉన్నాయా? లేదా రామచంద్ర ఆస్పత్రిలో ఉన్నాయా? అన్నది తేల్చుకునేందుకు అక్కడక్కడ పరుగులు పెట్టే వాళ్లూ ఉన్నారు. ఇక, తమ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉండటంతో పరిశీలన, పోస్టుమార్టం ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు అప్పగిస్తారో తెలియక రాయపేట మార్చురీ వద్ద తీవ్ర మనో వేదనతో పడిగాపులు కాస్తున్న కుటుంబాలు అనేకం. మరి కొందరికి మృతదేహాలు చూసే అవకాశం దక్కడం లేదు. ఆంధ్ర రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళంవాసులే కాకుండా, తమిళనాడుకు చెందిన బాధితులు సైతం ఇక్కడ మృత దేహాల కోసం వేచి ఉన్నారు. సుమారు పదిహేనుకు పైగా కుటుంబాలు ఇక్కడ తమ వాళ్ల కడచూపు కోసం ఎదురు చూపుల్లో ఉన్నాయి. మృత దేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
 
 ఆర్థిక కష్టాలు : అనేక తెలుగు కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మార్చురీ వద్ద తీవ్ర మనోవేదనలో మునిగి ఉన్నాయి. వేతనం రోజునే ప్రమాదం జరిగిన దృష్ట్యా, చేసిన కష్టానికి ప్రతి ఫలం లేక కొందరు, తెచ్చుకున్న డబ్బులు సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి అంటూ అక్కడా..ఇక్కడ తిరగడంతో అయిపోయూయి. ఇలా అనేక కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా కన్నీటి పర్యంతమవుతున్నారు. హెల్ప్‌లైన్ వద్ద ఇచ్చే అన్నం, నీళ్ల ప్యాకెట్లతో కడుపు నింపుకుంటూ మృత దేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బరువెక్కిన గుండెతో చెట్ట నీడన కూర్చుని ఉన్నారు.
 
 దుర్గంధం : మార్చురీ వద్ద బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడు అధికారులు, అటు ఆంధ్రా నుంచి వచ్చిన రెస్క్యూ టీం అధికారి, విజయనగరం హౌసింగ్ విభాగం డెప్యూటీ ఇంజనీర్ మురళీ మోహన్ తమకు అందిన సమాచారాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. అయితే, ఆ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన పరిసరాలు, మార్చురీ మార్గాలు ఉద యాన్నే దుర్గంధంగా మారాయి. దీంతో అక్కడ ఆగమేఘాలపై బ్లీచింగ్, క్రిమి సంహారక మందులు చల్లారు. హెల్ప్‌లైన్ అధికారులతో పాటుగా, అక్కడున్న బాధిత కుటుంబాలకు మాస్కులు అందజేశారు.
 
 గుర్తించ లేనివి : పన్నెండు మృత దేహాలు గుర్తించలేని రీతిలో చితికిపోయినట్టు మార్చురీ వర్గాలు, వైద్య బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ మృతదేహాలను బాధిత బంధువులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిని గుర్తించినా, ఎక్కడో మెలిక పెడుతుండడంతో, అనుమానంతో తదుపరి ఆ మృత దేహం కోసం ఎవరైనా వస్తారా? అన్న ఎదురు చూపుల్లో మార్చురీ వర్గాలు ఉన్నాయి. 27 మృతదేహాల్లో 18 పురుషులు, 9 మహిళలవి. ఇప్పటి వరకు ఒడిశాకు చెందిన నాలుగు, విల్లుపురానికి చెందిన రెండు, అంబత్తూరు, విజయనగరానికి చెందిన ఓ మృత దేహాన్ని ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు అప్పగించారు. గుర్తించని 12 మృతదేహాల్లో ఐదు స్త్రీలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో అంబులెన్స్‌లలో పంపిస్తున్నారు.
 
 ఎదురు చూస్తున్నాం
 మా బంధువు పద్మ ఈ ప్రమాదంలో మరణించింది. ఆమెను గుర్తించాం. అయితే, పోస్టుమార్టం అనంతరం మృత దేహం అప్పగిస్తామన్నారు. నేను ఒరగడంలో పనిచేస్తుంటాను. బంధువులు అప్పన్న, పద్మలు ప్రమాదం జరిగిన చోట రెండు నెలలుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పన్న ప్రమాదం నుంచి బయట పడ్డాడు. పద్మ మరణించడంతో ఆమె మృత దేహం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారో...ఎప్పుడు మా ఊరెళ్లాలో తెలియడం లేదు.
  - సూర్యనారాయణ, నర్సన్న పేట మండలం, శ్రీకాకుళం
 
 మరదలు చనిపోయింది
 అమ్మ, నాన్నతో పాటుగా మరదలు దుర్గా ప్రమాదం జరిగిన భవనంలో పనిచేశారు. దుర్గా మరణించినట్టు అధికారులు చెప్పారు. అయితే, అమ్మ నాన్నలు అప్పలరాము, లక్ష్మిల జాడ ఇంకా తెలియలేదు. దుర్గా మృత దేహాన్ని మార్చురీలో గుర్తించాను. ఇంకా, అమ్మనాన్నల జాడ తెలియలేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇక్కడ తిరుగుతున్నాను.
                 
 అన్ని ఏర్పాట్లు చేశాం
 శ్రీకాకుళం, విజయనగరం బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మృత దేహాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి, బంధువులకు వాటిని చూపించి గుర్తు పట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక మృత దేహాలు గుర్తించాల్సి ఉంది. ఇక్కడికి వచ్చే తెలుగు బాధితుల కుటుంబాలకు పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఆహారం అందిస్తున్నాం. మృత దేహాల్ని అంబులెన్స్‌లో స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశాం. బాధిత కుటుంబాలకు ఖర్చులకు గాను రూ.రెండు వేలు ఇచ్చి పంపుతున్నాం. పది మంది మృత దేహాలు ఆంధ్రాకు చెందిన వారివి గుర్తించాల్సి ఉంది. విజయ నగరానికి చెందిన సింహమ్మ మృత దేహాన్ని వారి స్వగ్రామానికి పంపించాం. మిగిలిన వారిని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు పంపుతాం. - మురళీ మోహన్  విజయనగరం డీఈ. హౌసింగ్ విభాగం ఇంజనీర్  
 

మరిన్ని వార్తలు