జైళ్లలో జీవిత ఖైదీలు

3 Mar, 2014 23:32 IST|Sakshi

 20 ఏళ్లుగా మగ్గుతున్న వందమంది
 కమిటీ సిఫార్సుల మాటేమిటి?
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీల క్షమాభిక్ష, విడుదల పుణ్యమా అని జైళ్లలోని ఖైదీల స్థితిగతుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆ ఏడుగురి విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుసాగుతుండగా, తమ సంగతేంటని 20 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జీవితఖైదీలు ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న పేరరివాళన్, శాంతన్, మురుగన్‌లకు సుప్రీం కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ జీవితఖైదీలుగా మార్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ ముగ్గురిని జైలు నుంచి విడుదల చేసే అధికారాన్ని కొన్ని చిన్నపాటి షరతులతో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీఎం జయలలిత పై ముగ్గురితోపాటూ ఆ కేసులో శిక్షను అనుభవిస్తున్న మరో నలుగురిని కలుపుకుని మొత్తం ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షకు నోచుకున్న ఏడుగురి విడుదల ప్రశ్నార్థకమైంది. ఏడుగురు ఖైదీల విడుదలకు కేంద్రం అడ్డుకోవడం రాష్ట్రంలో ఆగ్రహాన్ని రగిల్చింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
 
 4 వేల మంది జీవితఖైదీలు: రాష్ట్రంలో నాలుగువేల మంది జీవిత ఖైదీలు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో సుమారు వందమంది  20 ఏళ్లకు పైగా శిక్షను అనుభవిస్తున్నారు. జీవితఖైదీకి గురైన వ్యక్తి జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, సెలవులు ఇతర దినాలను కలుపుకుని పదేళ్లకే విడుదలయ్యే అవకాశం ఉంది. అదే ఉరిశిక్ష ఖైదీ యావజ్జీవ ఖైదీగా మారిన పక్షంలో అతని ప్రవర్తనను బట్టీ 14 ఏళ్ల తరువాత విడుదలయ్యే వెసులుబాటు ఉంది. జైలు జీవితంలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడినా, ఆరోపణలకు గురైనా చట్టపరంగా పొందే రాయితీలన్నీ అమల్లోకి రావు. ఖైదీల ప్రవర్తనను విశ్లేషించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సంఘ సంస్కర్తలతో ఒక కమిటీ పనిచేస్తుంది.
 
  ఖైదీల ప్రవర్తనపై ఒక నివేదికను తయారుచేసి విడుదలకు అర్హులైన ఖైదీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలుచేస్తుంది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద వివిధ జైళ్లలో నాలుగు వేల మంది జీవితఖైదీలు ఉన్నారు. వీరిలో వందమంది ఖైదీలు 20 ఏళ్ల శిక్షాకాలాన్ని దాటివేశారు. రాజీవ్‌హత్యకేసులోని ఏడుగురి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తమ సంతోషకరమే, అయితే నడవడిక ప్రకారం విడుదల కావాల్సిన తమ మాటేమిటని వారు పోతున్నారు. సత్ప్రవర్తనా కమిటీ సమావేశమై అర్హులకు జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు