నగారా మోగింది | Sakshi
Sakshi News home page

నగారా మోగింది

Published Mon, Mar 3 2014 11:25 PM

medchal elections postponed due to court dispute

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) పురపాలికల సమరానికి ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎస్‌ఈసీ.. ఈనెల 30న జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వార్డుల పునర్విభజన ప్రక్రియపై న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నందున మేడ్చల్ పురపాలక సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరపడంలేదని పేర్కొంది. మిగతా బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలుసహా తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలకు ఒకే రోజున పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

 1.98 లక్షల మంది ఓటర్లు
 మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. కొత్తగా పనుల మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టకూడదని ఆదేశాలిచ్చాం. కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థుల ప్రచార సరళిని కూడా నిశితంగా పరిశీలించనున్నాం. మద్యం, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పరిశీలకులను కూడా వినియోగిస్తాం. ఎన్నికలకు ఐదు మున్సిపాలిటీలకే పరిమితమైనా, కోడ్  జిల్లా అంతటికీ వర్తిస్తుంది. ఐదు పురపాలికల పరిధిలో 1,98,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 174 పోలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

119 వార్డులకు జరిగే ఈ ఎన్నికల్లో 174 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను వాడనున్నాం. సాంకేతిక ఇబ్బం దులు తలెత్తితే అప్పటికప్పుడు అమర్చడానికి పది శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచనున్నాం. సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెడుతున్న తిరస్కరణ ఓటు(నోటా) విధానం మున్సిపాలిటీ ఎ న్నికల్లో అమలు చేయడంలేదు. పాత ఈవీఎంలను వినియోగిస్తున్నందున నోటా అమలు సాధ్యపడడంలేదు.

 కేసు పెండింగ్‌లో ఉండడంతో...
 మేడ్చల్ నగర పంచాయతీకి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంలేదు. న్యాయస్థానంలో కేసు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఈ పట్టణ ఎన్నికలను వాయిదా వేసింది. శివార్లలోని 35 గ్రామ పంచాయతీలను పన్నెండు కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలకు ఇంకా ప్రభుత్వం ఆమోదముద్ర వేయలేదు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన అనంతరం వీటి ఎన్నికలు జరిగే అవకాశముంది.

 ప్రతి బూత్‌కు నలుగురు పోలింగ్ సిబ్బంది
 స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి బూత్‌కు నలుగురు విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాం. పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుం టారు. వీరికి అదనంగా 10శాతం సిబ్బందిని ఇస్తున్నాం. పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జోనల్ అధికారులను రంగంలోకి దించుతాం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నాం. ఆయా మున్సిపాలిటీ ల ప్రత్యేకాధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమావేశమై.. పోలీసు బలగాల అవసరాలపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించా.

Advertisement
Advertisement