ఓడాం...ఘోరంగా కాదు

18 May, 2014 02:42 IST|Sakshi

అధిష్టానానికి సీఎం సంజాయిషీ
 సోనియా, డిగ్గీకి వివరణ
 మోడీ ప్రభంజనాన్ని కొంత ఆపాం
 మెరుగైన ఫలితాలు సాధించాం
 మితిమీరిన ఆత్మ విశ్వాసమే దెబ్బతీసింది
 పరమేశ్వరపై సిద్ధు ఫిర్యాదు?
 పార్టీపై బహిరంగ విమర్శలు చేశారంటూ ఆరోపణ

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవలేక పోయినా, దేశంలో ఇతర రాష్ట్రాల్లో లాగా మోడీ ప్రభంజనం లేకుండా చూడగలిగామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధిష్టానానికి విన్నవించారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరతో కలసి ఆయన ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను శనివారం కలుసుకున్నారు. సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ వాదనలను వినిపించారు.

‘2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను సాధించాం. అప్పట్లో కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలవగలిగాం. ఈసారి మరో మూడు సీట్లు పెరిగాయి. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ సొంతంగా ఇన్ని స్థానాల్లో గెలవలేదు’ అని వారు వివరించినట్లు తెలిసింది. సీట్లు తగ్గినా ఓట్లు బాగానే వచ్చాయని, మున్ముందు పార్టీని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

కొన్ని నియోజక వర్గాల్లో నాయకుల సహాయ నిరాకరణ వల్ల కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. మరి కొన్ని నియోజక వర్గాల్లో మితిమీరిన ఆత్మ విశ్వాసం దెబ్బ తీసిందన్నారు. ఇదే సమయంలో పార్టీకి గెలుపు అవకాశాలున్నా, విజయాన్ని సొంతం చేసుకోలేని నియోజక వర్గాల్లో పని చేసిన మంత్రులను బాధ్యులను చేయాల్సిందిగా అధిష్టానం సూచించినట్లు తెలిసింది.
 
పరమేశ్వరపై ఫిర్యాదు?
 
ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్‌ను విడిగా కలుసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి, పరమేశ్వరపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో పరమేశ్వర సరైన సహకారం అందించ లేదని, ఓ సమావేశంలో మాట్లాడుతూ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ వంచించిందని ఆరోపించారని తెలిపారు. మరో సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్‌కు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా బహిరంగంగానే అృసంతప్తి వ్యక్తం చేశారని ఫిర్యాదు చేశారు. దీని వల్ల కాంగ్రెస్‌కు సంప్రదాయక ఓటు బ్యాంకులైన ఈ వర్గాల నుంచి ఓట్లు బీజేపీ వైపు మళ్లాయని ఆరోపించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు