నిషేధమున్నా యథేచ్ఛగా!

26 Aug, 2014 23:02 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ:హైకోర్టు విధించిన నిషేధాన్ని ఈ-రిక్షావాలాలు పట్టించుకోవడం లేదు. అవి నగర రహదార్లపై జోరుగా తిరుగుతున్నాయి. చివరి నిమిషంలో గమ్యం చేరుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతుండడంతో ప్రయాణికులు వాటిని విడిచిపెట్టడం లేదు. నిషేధం విధించేముందు ప్రభుత్వం తమకు మరో ప్రత్యామ్నాయాన్ని చూపాలని వారంటున్నారు. గురుగోవింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ యూనివర్సిటీ, ద్వారకా సెక్టర్ 14 మెట్రో స్టేషన్, పాలం, రఘునగర్, కరోల్ బాగ్, శక్తినగర్ తదితర ప్రాంతాల్లో ఈ రిక్షాలు ఇప్పటికీ తిరుగుతున్నాయి. హైకోర్టు నిషేధాన్ని ఈ-రిక్షా చోదకులు గానీ, ప్రయాణికులు గానీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆటో రిక్షాల కన్నా ఇవే చౌక అని, అలాగే మామూలు రిక్షా కంటే త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటామని ప్రయానికులు అంటున్నారు. ప్రజారవాణా సదుపాయం లేని మార్గాల్లో వీటి సేవలను ఉపయోగించడం తప్ప తమకు మరో మార్గంలేదని వారంటున్నారు.
 
 తమకు ఉపాధికి ఇదే మార్గమని, అందువల్ల దానిపై నిషేధం విధించినా ఖాతరు చేయడం లేదని ఈ-రిక్షా చోదకులు అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది ఎక్కడ పట్టుకుంటారోననే భయం వెన్నాడుతున్నప్పటికీ కుటుంబ పోషణకకోసం రిసు తీసుకోకతప్పడం లేదని వారంటున్నారు. ఈ భయం కారణంగానే ప్రధాన రహదారుల్లో కాకుండా వీధులకే పరిమితమవుతున్నామనని వారు చెప్పారు. ఈ రిక్షాలవల్ల ఒక దుర్ఘటన జరిగినంత మాత్రాన వాటిపై నిషేధం విధించడం సబబు కాదని వాదిస్తున్నారు.   బస్సులు, ఆటోలు, కార్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, మరికి వాటిపై విధించని వీటిపైనే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.ఇదిలాఉండగా ఈ రిక్షాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వాటి చోదకులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిషేధం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిక్షా చోదకులు నిర్వహించిన నిరసన ప్రదర్శన  కార్యక్రమంలో పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా కూడా పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు