‘డాక్యుమెంటరీ’పై నేడు విచారణ

17 Mar, 2015 23:42 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటనపై తీసిన వివాదాస్పద ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఈ వీడియోకు సంబంధించిన సీడీలు, పత్రాలను పిటిషనర్ ఇంతకు ముందే కోర్టులో సమర్పించారు. జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంటరీ ప్రసారం చేయడాన్ని సవాల్ చేస్తూ లా విద్యార్థి విభోర్ ఆనంద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్‌లతో కూడిన బెంచ్ విచారించనుంది. అసలు విషయం నేరుగా తెలుసుకోకుండా మీడియా ప్రసారాలతో న్యాయవాదులు ప్రభావితం అయ్యే ఆస్కారం ఉందని మార్చి 12న జరిగిన విచారణలో కోర్టు పేర్కొంది. అలాగే ప్రసారంపై వ్యతిరేకత లేదని, నిందితుల విన్నపాలను విన్న తర్వాత సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు ప్రసార విషయం తేలుతుందని హైకోర్టు పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు