దేవేగౌడ ఆమరణ దీక్ష

28 Jul, 2015 02:20 IST|Sakshi
దేవేగౌడ ఆమరణ దీక్ష

‘జంతర్-మంతర్’లో ప్రారంభమైన దీక్ష.

బెంగళూరు: కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో చర్చించేందుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సోమవారం ఉదయం నుంచి దేవేగౌడ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ, కర్ణాటకలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కర్ణాటకలో మాత్రమే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పరిష్కారం లభించడం లేదని మండిపడ్డారు. ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇక కర్ణాటక విషయానికి వస్తే జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులపై వడ్డీని మాఫీ చేయాలని కోరారు. కర్ణాటకలో చెరకు, దానిమ్మ, ద్రాక్ష, పట్టు రైతులు సరైన మద్దతు ధర లభించక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు  అందజేయాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే ఈ విషయాలన్నింటిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకుగాను సమయం కేటాయించాలని కోరారు. ఈ విషయంపై స్పీకర్ స్పందించే వరకు తన దీక్షను విరమించబోనని పేర్కొన్నారు. ఇక దేవేగౌడ చేపట్టిన ఆమరణ దీక్షకు జేడీయూ నేత శరద్ యాదవ్‌తోపాటు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు మద్దతు తెలిపారు. దీక్షా స్థలి వద్దకు చేరుకున్న నేతలు దేవేగౌడకు తమ మద్దతు తెలియజేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామితోపాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.  
 
 

మరిన్ని వార్తలు