ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ

22 Jul, 2014 23:49 IST|Sakshi
ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కోసం ఒకప్పుడు గట్టి పోటీ నెలకొనేది. పరిమితంగా ఉన్న కళాశాలల్లో ముఖ్య సీట్లను కైవశం చేసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. పరిమితం నుంచి అపరిమిత స్థాయికి రాష్ట్రంలో కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 571 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2,88,486 సీట్లు ఉన్నాయి. వీటిలో ఇది వరకు ప్రభుత్వ కోటా సీట్లు 1,69,789 ఉండేవి. రెండుమూడేళ్లుగా సీట్ల భర్తీ తగ్గుముఖం పడుతుండడంతో అనేక కళాశాలలు తమ యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వానికే ఇచ్చే పనిలో పడ్డాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ కోటా సీట్ల సంఖ్య 2,11,355కు చేరింది. అన్నావర్సిటీ నేతృత్వంలో ప్రతి  ఏటా ఈ కోటా సీట్లను భర్తీ చేస్తున్నారు.
 
 ఆదరణ కరువు: గత ఏడాది అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో పలు కోర్సులకు విద్యార్థులే కరువయ్యారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జనరల్ కోటా సీట్లకు 1,69,789 మంది దరఖాస్తులు చేసుకోవడంతో ప్రభుత్వ కోటా సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేది కూడా కష్టంగా మారింది. ప్రభుత్వ కోటా సీట్లు కొంత మేరకు ఖాళీగా ఉండొచ్చన్న భావన తొలుత బయలు దేరినా, ప్రస్తుతం ఆ ఖాళీ లక్ష వరకు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు కారణం విద్యార్థులు ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టకపోవడమే. ఈ ఏడాది ప్లస్‌టూ ఉత్తీర్ణత శాతం గణనీయంగా ఉన్నా, ఇంజనీరింగ్ మీద విద్యార్థులు దృష్టి పెట్టక పోవడం కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
 
 ఆందోళన : పుట్టగొడుగుల్లా కళాశాలలు పుట్టుకు వచ్చినా, విద్యా నాణ్యతను పాటించే సంస్థలు అంతంత మాత్రమేనన్న విమర్శలు రాష్ట్రంలో కొంతకాలంగా వినిపిస్తున్నారుు. కొన్ని గుర్తింపు పొందిన అతి పెద్ద కళాశాలల్లో సీట్ల కోసం మాత్రమే విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో, దక్షిణాది జిల్లాల్లోని అనేక కళాశాలల మీద విద్యార్థులు దృష్టి పెట్టడం లేదని తాజా కౌన్సెలింగ్ ద్వారా స్పష్టం అవుతోంది. గ్రామీణ విద్యార్థులకు ఉన్నత చదువులను దరి చేర్చాలన్న కాంక్షతో నెలకొల్పిన ప్రభుత్వ కళాశాలల్లోనూ సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. ప్రతి ఏటా సీట్ల ఖాళీలు పెరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంటోంది. ఈ ఖాళీలతో కళాశాలల నిర్వహణా పరిస్థితి దారుణంగా తయార య్యే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 వెయ్యి మంది కరువు : ఇంజనీరింగ్ సీట్ల వ్యవహారం మంగళవారం అసెంబ్లీకి చేరింది. తమ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యేనా? అని ఓ సభ్యుడు వేసిన ప్రశ్నకు ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ సభ్యుడు ఆర్ముగం తన నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు విషయంగా సంధించిన ప్రశ్నకు మంత్రి పళనియప్పన్ స్పందిస్తూ, ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల భర్తీ పురాణం అందుకున్నారు. 2,11,358 సీట్లు ప్రభుత్వ కోటాలో ఉన్నాయని, రోజుకు నాలుగు వేల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నామని వివరించారు. అయితే కనీసం వెయ్యి మంది కూడా కౌన్సెలింగ్‌కు రావడం లేదని, దీన్ని బట్టి అర్థం చేసుకోండి... ఇంజనీరింగ్ సీట్లు ఏ మేరకు ఖాళీగా ఉన్నాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కళాశాలల్లోనే సీట్లు వేలాదిగా ఖాళీలుగా మిగులుతుంటే, ఇక కొత్త కళాశాలల ప్రస్తావన తెచ్చే పరిస్థితి లేదని, కొత్త కళాశాలలు ఏర్పాటు చేయబోవడం లేదని స్పష్టం చేయడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు