రంగంలోకి రజనీ అభిమానులు

20 Feb, 2015 08:32 IST|Sakshi
రంగంలోకి రజనీ అభిమానులు

 లింగా చిత్ర వ్యవహారం రంగులు మారుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రం రజనీ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 12న భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయామంటూ రోడ్డెక్కారు. కోర్టులు, నిరాహారదీక్షలు ఆందోళన బాటపట్టారు.
 
 దీంతో రజనీకాంత్ జోక్యం చేసుకోక తప్పలేదు. లింగా వసూళ్లపై దర్యాప్తు చేయించి నివేదికను నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు పంపారు. దీంతో ఆయన 10 శాతం నష్టపరిహారం చెల్లించగలనని తేల్చి చెప్పేశారు. అందుకు సమ్మతించిన డిస్ట్రిబ్యూటర్లు ఇక రజనీకాంత్‌ను నమ్మి ప్రయోజనం లేదని భిక్షాటన చేస్తామంటూ ప్రకటించారు. రజనీకాంత్ ఇంటి నుంచే ఈ భిక్షాటన పోరాటం మొదలెడుతామని వెల్లడించారు. దీన్ని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
  అయితే తమిళ దర్శకుల సంఘం రజనీకి బాసటగా నిలవగా కొన్ని రాజకీయ సంఘాలు డిస్ట్రిబ్యూటర్లకు వత్తాసు పలకడం విశేషం. దక్షిణ భారత నటీనటుల సంఘం రజనీకే మద్దతు అన్న ప్రచారానికి ఆ సంఘం అధ్యక్షుడు ఖండించారు. ఇప్పటి వరకు ఈ చోద్యం చూస్తూ మౌనం వహించిన రజనీ అభిమానులు ఇప్పుడు రంగంలోకి దిగారు. డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ, నగరంలో పోస్టర్లు అంటించారు. మరో పక్క భిక్షాటన పోరు బాటకు సిద్ధమవుతున్న డిస్ట్రిబ్యూటర్లకు పోలీసులు అనుమతి లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
 

మరిన్ని వార్తలు