రెండ్రాలజీలో బ్రిక్ ఈగిల్ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

రెండ్రాలజీలో బ్రిక్ ఈగిల్ పెట్టుబడులు

Published Fri, Feb 20 2015 2:14 AM

రెండ్రాలజీలో బ్రిక్ ఈగిల్ పెట్టుబడులు - Sakshi

ప్రస్తుతం రూ.10 కోట్లు  
ఈ ఏడాది చివరికల్లా రూ.30 కోట్లు

పైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన బ్రిక్ ఈగిల్.. ఇంటీరియర్ డిజైన్ సొల్యూషన్ సంస్థ అయిన రెండ్రాలజీలో రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కంపెనీ పనితీరు, ప్రమాణాల ఆధారంగా ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.30 కోట్ల పెట్టుబడులు పెడతామని బ్రిక్ ఈగిల్ ఫౌండర్, సీఈఓ రాజేష్ కృష్ణన్ చెప్పారు. గురవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశల వారీగా రెండ్రాలజీ కంపెనీలో మొత్తం రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అనంతరం రెండ్రాలజీ ఫౌండర్, సీఈఓ శైలేష్ గోస్వామి మాట్లాడుతూ.. ‘‘దేశంలోని ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారంలో ప్రొఫిషనల్ ఇంటీరియర్ డిజైనర్స్ వాటా కేవలం 1 శాతం మాత్రమే. మిగతాదంతా కార్పెంటర్లు చేస్తున్నదే. వీటికి బ్రాండింగ్ అంటూ ఏమీ ఉండదు. దీంతో ఖర్చుకు ఖర్చు.. ఇంట్లో స్థల దుర్వినియోగం ఎక్కువగా ఉంటుండటంతో చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఇంటీరియర్ డిజైన్‌కు దూరంగా ఉంటున్నారని’’ చెప్పారు. ప్రస్తుతం కంపెనీలో 550 మంది కస్టమర్లున్నారని.. ఈ ఏడాది ముంగిపు నాటికి 1,200 మంది కస్టమర్లను చేరుకుంటామని పేర్కొన్నారు.

ప్రస్తుతం నివాస సముదాయాలకే పరిమితమైన సేవలు సమీప భవిష్యత్తులో వాణిజ్య సముదాయాలకూ విస్తరిస్తామన్నారు. ‘ హైదరాబాద్, మహారాష్ట్ర, చెన్నై నగరాల్లోని పలు కంపెనీల్లో డిజైన్స్ చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలకల్లా మహేంద్రా, మంత్రి, పుర్వాంకర వంటి 15 కంపెనీల్లో తమ సేవలందించనున్నాం. అలాగే సంస్థ సేవలు బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, చెన్నై, ముంబై నగరాలకూ విస్తరించనున్నట్లు’ శైలేష్ చెప్పుకొచ్చారు. బ్రిక్ ఈగిల్ విడుదల చేసిన నిధులను సంస్థ అభివృద్ధికి, విస్తరణ కోసం వినియోగిస్తామని ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చుచేస్తామన్నారు. టెక్నాలజీ సహాయంతో తక్కువ స్థలం ఉన్న ఇళ్లలోనూ అందమైన ఇంటీరియర్‌ను డిజైన్ చేసుకోవచ్చని సూచించారు.

Advertisement
Advertisement