భూములు తీసుకుంటే.. కాపురాలు కూలుతాయి!

27 Sep, 2016 19:11 IST|Sakshi
భూములు తీసుకుంటే.. కాపురాలు కూలుతాయి!

భూ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్
భూ దందాపై మూకుమ్మడిగా రైతుల అభ్యంతరాలు


మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ప్రభుత్వంపై రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. మచిలీపట్నంలో పారిశ్రామిక కారిడార్, పోర్టు నిర్మాణం పేరుతో 33,601 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో మంగళవారం కోన, పోలాటితిప్ప, అరిసేపల్లి, మేకవానిపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో రైతుల నుంచి అంగీకారపత్రాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు అవగాహన సదస్సులను మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) అధికారులు ఏర్పాటు చేశారు.

మాకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని కూతుళ్ల పెళ్లి చేసే సమయంలో కట్నంగా ఇచ్చామని, భూ సమీకరణ పేరుతో ఆ భూములు తీసుకుంటే వందలాది కాపురాలు కూలిపోయే ప్రమాదం ఏర్పడుతోందని పలువురు మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలకు అతీతంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించి సంతకాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అసైన్డ్ భూములు సమీకరణ నోటిఫికేషన్‌లో ఒకరి పేరున ఉండగా వేరే రైతులు ఆ భూమికి హక్కుదారులుగా ఉన్నారని ఈ తరహా రైతులను ఏం చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు.

గ్రామాలకు గ్రామాలను సైతం ఖాళీ చేయించే పనిలో భాగంగా భూసమీకరణ అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని, ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసమీకరణ అవగాహన సదస్సు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని భూములు గుంజుకోలేరని రైతులు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భూసమీకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ భూ దందాను ఇప్పటికైనా ఆపాలని అన్ని గ్రామాల్లోని రైతులు నినాదాలు చేశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం జరగటంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు