ఆహారం అంటూ అన్యాయం చేశారు

3 Mar, 2014 23:12 IST|Sakshi

 అన్నశ్రీ యోజన అమలు కావడం లేదు
 లబ్ధిదారులకు రూపాయి కూడా చెల్లించలేదు
 ప్రకటనల కోసం మాత్రం రూ.కోట్లు ఖర్చు చేశారు
 కేజ్రీవాల్, దీక్షిత్‌పై మండిపడ్డ హర్షవర్ధన్

 
 న్యూఢిల్లీ: ఆహారభద్రత పథకం పేరుతో ఇద్దరు ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్ 15 లక్షల మంది ఢిల్లీవాసులను వంచించారని ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం అన్నారు. ఆహారభద్రతలో భాగంగా అన్నశ్రీ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తామని ఆప్, కాంగ్రెస్ ప్రకటించాయన్నారు. ‘ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ రూపాయి కూడా చెల్లించలేదు. ఆహారభద్రత పథకం అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ అంటూ అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియాలో ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రకటనలకే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా పేదలకు ఒక్క పైసా చెల్లించలేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా అన్నశ్రీ యోజనను అమలు చేయలేదు.
 
  ఈ పథకం కోసం దాదాపు 15 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. దీనిని జాతీయ ఆహార భద్రత పథకంలో కలిపేశామని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది’ అని హర్షవర్ధన్ వివరించారు. నెలకు రూ.600 వస్తాయనే ఆశతో ఎంతో మంది అధికారులకు లంచాలు చెల్లించి లబ్ధిదారులుగా పేర్లు నమోదు చేసుకున్నరని, ప్రభుత్వం ఒక్క పైసా చెల్లించకుండా దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినా ఢిల్లీలో ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదని బీజేపీ విమర్శించింది.
 
  బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వస్తే పేదలందరికీ తక్కువ ధరలకు సరుకులు అందజేస్తామని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రకటించారు.
 
 

మరిన్ని వార్తలు