కుమారుడికే పగ్గాలు

14 Nov, 2014 02:17 IST|Sakshi
కుమారుడికే పగ్గాలు

సాక్షి,బెంగళూరు : జేడీఎస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఆ పార్టీ శాసనసభపక్ష నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ గురువారం జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మెజారిటీ నాయకులు కుమారస్వామి పేరును సూచిం చడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగత అభిమానం కాని, కుటుంబ సభ్యుడనే అభిమానం కాని లేదని ఆయన స్పష్టం చేశారు. ‘జేడీఎస్‌ను కొంతమంది అప్ప-మక్కలు (తండ్రి-కొడుకుల) పార్టీ అంటూ ఎద్దేవా చేయడం మానుకోవాలి.

ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మమతాబెనర్జీ, మాయావతిలకు కుమారులు ఉంటే వారిని తాముం టున్న పార్టీల్లో ఎదగనిచ్చేవారుకాదా?’ అని పేర్కొన్నారు. దేశంలో చాలా మంది తండ్రి, కొడుకులు ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన సంఘటనలు తన రాజకీయ జీవితంలో అనేకం చూసానన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జేడీఎస్‌ను నాశనం చేయడానికి వీలుకాదని  పేర్కొన్నారు.

28న పార్టీ సమావేశం...
ఈనెల 28న బెంగళూరులో పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు దేవెగౌడ తెలిపారు. 1970 నుంచి జేడీఎస్ పార్టీలో ఉన్నవారితో పాటు ఇతర పార్టీలోకి వెళ్లి తిరిగి జేడీఎస్‌లోకి రావాలనుకునేవారు ఈ సమావేశానికి హాజరుకావచ్చని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ పాల్గొంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా కుమారస్వామి పేర్కొన్నారు. కాగా, కృష్ణప్ప మరణం తర్వాత దాదాపు ఏడు నెలలు జేడీఎస్ రాష్ర్ట అధ్యక్ష పదవి ఖాళీగా ఉండగా తాత్కాలిక అధ్యక్షుడిగా నారాయణరావు వ్యవహరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు