హాస్టళ్లు లేక అవస్థలు

3 Aug, 2014 22:11 IST|Sakshi
హాస్టళ్లు లేక అవస్థలు

 న్యూఢిల్లీ: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటే తప్ప ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో సీటు సంపాదించడం సాధ్యం కాదు. అంతగా శ్రమించి అడ్మిషన్ సంపాదించిన విద్యార్థులకు కనీస వసతి కల్పించడంలో డీయూ విఫలమయింది. హాస్టళ్లలో తగినన్ని సీట్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు పీజీ హాస్టళ్లు లేదా గదులు కిరాయికి తీసుకుంటున్నారు. డీయూకు 15 ఆఫ్-క్యాంపస్ హాస్టళ్లు ఉండగా, తొమ్మిది కాలేజీల్లో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఐదు కాలేజీల్లో మాత్రమే మహిళలకు వసతి ఉంటుంది.
 
 డీయూలో 1.8 లక్షల మంది అండర్‌గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులు ఉండగా, వీరందరికీ అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు తొమ్మిది వేలు మాత్రమే. డీయూ ఏటా కొత్తగా 55 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. హాస్టళ్లలో సీటు దొరకడం సాధ్యం కాకపోవడంతో మెజారిటీ విద్యార్థులు ప్రత్యామ్నాయ వసతి వెతుక్కోక తప్పదు. ఫలితంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడమే గాక, భద్రత కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఉండాల్సి వస్తోందని. ‘భారీగా ఉన్న కటాఫ్ జాబితాల్లో సీటు సంపాదించుకొని కాలేజీలో అడుగుపెడితే హాస్టల్ వసతి లేదు. దాదాపు పక్షం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ కిరాయికి గది దొరకలేదు’ అని ఈ ఏడాది డీయూలో చేరిన ఖ్యాతిశర్మ చెప్పింది. డీయూ హాస్టళ్లు కూడా ప్రతిభ ఆధారంగానే సీట్లు ఇస్తాయి. మంచి కాలేజీలోనే కాదు, హాస్టల్ సీటు రావాలన్నా సదరు విద్యార్థులకు భారీగా మార్కులు రావాల్సిందే.
 
 అయితే కిరాయి గదులు/హాస్టళ్లలో ఉండే యువతులకు భద్రత ప్రధాన సమస్యగా మారింది. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థినులు హాస్టల్ వసతి కోసం తక్కువ కటాఫ్‌లు ఉన్న కాలేజీల్లో చేరాల్సి వస్తోందని ఇషానీ బెనర్జీ అనే యువతి తెలిపింది. విజయ్‌నగర్, హడ్సన్‌లేన్, బంగ్లారోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఒక్కొక్కరికి నెలకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.తొమ్మిది వేల దాకా వసూలు చేస్తున్నారు. ‘మేం వై-ఫై, లాండ్రీ, వంటమనిషి వంటి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం కాబట్టి రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మేం వ్యాపారం కొనసాగించాలంటే ఈ మాత్రం వసూలు చేయకతప్పదు’ అని హడ్సన్‌లేన్‌లో పీజీ హాస్టల్ నిర్వహించే శివానంద్ ఖేరా అన్నారు. డీయూ మరిన్ని హాస్టళ్లు నిర్మించాలనే డిమాండ్‌తో విద్యార్థులు గత ఏడాది ఆందోళనలకు దిగారు.
 
 డీయూ యాజమాన్యం హామీ మేరకు ఉద్యమాన్ని విరమించినా, ఇప్పటి వరకు హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థిసంఘం నాయకుడు అన్నారు. డీయూ విద్యార్థుల సంఘం (డూసూ), డీయూ అధ్యాపకుల సంఘం (డూటా), యూనివర్సిటీ విభాగాలు కూడా నూతన హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘డీయూలో ఉన్న ఐదుశాతం మంది విద్యార్థులకు కూడా హాస్టళ్లు సరిపోవడం లేదు. వసతి కల్పించాలంటూ విద్యార్థులు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. కొత్తగా ఒకటిరెండు హాస్టళ్లు నిర్మించినా అవి ఏ మూలకూ చాలవు’ అని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ అన్నారు.
 
 ఈ విషయమై డీయూ వర్గాలు స్పందిస్తూ కొత్త హాస్టళ్ల కోసం ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, ఈ విషయంలో యూనివర్సిటీ నిర్లక్ష్యం ఏదీ లేదని చెప్పాయి. కొత్త హాస్టళ్లు నిర్మించడానికి డీడీఏ, ఉద్యానవనశాఖ వంటి విభాగాల అనుమతి తప్పనిసరని అధికారులు అంటున్నారు. తాము నిధులు కేటాయించినా, నిర్మాణ పనులు మొదలు కావడానికి చాలా సమయం పడుతుందని డీయూ విద్యార్థుల సంక్షేమ విభాగం డీన్ జె.ఎం.ఖురానా అన్నారు.
 

మరిన్ని వార్తలు