విషవాయువులతో 400 మందికి అస్వస్థత

29 Nov, 2014 22:15 IST|Sakshi
విషవాయువులతో 400 మందికి అస్వస్థత

* రసాయనాల కంపెనీ నిర్వాకమని ఆరోపణ
* శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన బాధితులు
* పలు ఆస్పత్రుల్లో చికిత్స
* సీరియస్‌గా ఉన్న ఇద్దరిని ముంబై తరలింపు
* బాధితులకు పలువురు రాజకీయనాయకుల పరామర్శ
* కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

 
సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్,అంబర్‌నాథ్ పట్టణాలను విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు 400 మంది ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం.  రెండు పట్టణాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అంబర్‌నాథ్ ఎంఐడీసీలోని ఓ రసాయనాల కంపెనీకి చెందిన ట్యాంకర్‌లోని అపాయకరమైన రసాయనాలను అంబర్‌నాథ్ వడోల్ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న వాలధుని నదీలో శుక్రవారం అర్ధరాత్రి వదిలేశారు. దాంతో విషవాయువులు ఈ రెండు పట్టణాల్లో వ్యాపించాయి.

వాటిని పీల్చిన వారికి ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కళ్లు మండటం, కళ్లు తిరగడం తదితర సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో శనివారం తెల్లవారుజాము సుమారు మూడు గంటల నుంచి వడోల్‌గావ్, సమ్రాట్ అశోక్‌నగర్, రేణుకా సొసైటీ, లాసీపాడా, పహలుమల్ కంపౌండ్, అయోధ్యనగర్ తదితర పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల ఏం జరిగిందో అర్థకం కాక అనేక మంది ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.  కొందరు స్వయంగా ఆస్పత్రుల్లో చేరగా మరికొందరిని తర్వాత సుమారు 25 అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. ఉల్లాస్‌నగర్‌లోప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చిన పలు అంబులెన్స్‌లు బారులు తీరిన దృశ్యమే పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టిందనవచ్చు.

కాగా, బాధితుల్లో  దీపక్ ముపే, హసీనా శేఖ్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు వారిని ముంబైకి తరలించారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరగడంతో శివనేరి, శర్వానంద్, ఈఎస్‌ఐఎస్, త్రిమూర్తి మొదలగు ఆస్పత్రుల్లో చేర్పించారు. పరిస్థితి తెలుసుకున్న శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్ బాలాజీ ఖతగావ్కర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ వసంత్ జాదవ్, ఉపజిల్లాధికారి చంద్రకాంత్ బోడారే, మేయర్ అపేక్ష పాటిల్, ఆర్‌పిఐ జిల్లా అధ్యక్షుడు నానా బాగుల్, ఎమ్మెన్నెస్ విద్యార్థి సేన జిల్లా ఉపాధ్యక్షుడు బండు దేశ్‌ముఖ్ తదితరులు బాధితులను పరామర్శించారు.  ఈ విషయంపై హిల్‌లైన్ పోలీసు స్టేషన్, సెంట్రల్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.

>
మరిన్ని వార్తలు