నియంత్రణ ‘హద్దు’ను దాటుతాం!

11 Oct, 2016 09:04 IST|Sakshi
నియంత్రణ ‘హద్దు’ను దాటుతాం!

పీఓకేలోకి వెళ్లయినా ఉగ్రవాదులను వేటాడతాం
సర్జికల్ దాడులతో భారత వైఖరిలో భారీ మార్పు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత్ వైఖరి క్రమంగా మారుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే వాటిని తీవ్రంగా ఖండించడం, అవి పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు జరిపినవేనని సాక్ష్యాలు అందించటం, దాడుల కారకులకు శిక్ష పడేలా చూడాలని పాకిస్తాన్‌ను అభ్యర్థించడం.. ఇంతవరకే భారత్ పరిమితమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోందనీ, రాయబారాన్ని దాటి  దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు.

నియంత్రణ రేఖ ఇక ఎంతమాత్రం అనుల్లంఘనీయం కాదనీ, పాక్ ఉగ్రవాదులను హద్దు దాటించి భారత్‌లోకి పంపిస్తూ ఉంటే తామూ చూస్తూ ఊరుకోమని సర్జికల్ దాడుల ద్వారా భారత్ గ ట్టి హెచ్చరికలే పంపింది. నియంత్రణ రేఖ దాటి పీఓకేలోకి అడుగుపెట్టైనా ఉగ్రవాదుల పీచమణచడానికి సిద్ధమని సెప్టెంబర్ 29 నాటి దాడితో భారత్ నిరూపించింది. నియంత్రణ రేఖను పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు ఉల్లంఘిస్తుంటే.. వారిని వేటాడేందుకు తాము కూడా హద్దు దాటడానికి వెనుకాడమని పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్ చెప్పింది.

సిద్ధంగా ఉండండి: ప్రభుత్వం
పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్మీకి తగినన్ని ఆయుధాలను అందించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆయుధాలు సరఫరా చేసే వారిని కోరింది. ఉత్పత్తిని పెంచాలనీ, అడిగిన తర్వాత వీలైనంత తొందర్లో ఆయుధాలను చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కంపెనీలకు చెప్పినట్లు అధికారులు, కంపెనీల యజమానులు తెలిపారు. చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సుఖోయ్, మిరేగ్ యుద్ధవిమానాలకు అమర్చడానికి విడి భాగాలు, ఆయుధాలను ప్రభుత్వం కంపెనీలను కోరుతోంది.
 
1999 నాటి వైఖరికి విరుద్ధం

భారత ప్రస్తుత వైఖరి 1999లో కార్గిల్ యుద్ధం నాటి దానికి పూర్తిగా విరుద్ధం. 1999లో పాక్ నియంత్రణ రేఖను కార్గిల్ వరకు గీయాలని యత్నించి, అంతర్జాతీయ సమాజం హెచ్చరికతో వెనక్కు తగ్గింది. అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్, సరిహద్దులను రక్తంతో తిరిగి గీయకూడదని వ్యాఖ్యానించారు. అయితే కొంతకాలంగా ఉల్లంఘనలు మళ్లీ తారాస్థాయికి చేరా యి. పాక్ ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతూనే ఉంది. అయినా గత దశాబ్దకాలంగా భారత్ రాయబారం మాత్రమే నడుపుతోంది. అయితే ఇప్పుడు ఆ వైఖరిలో మార్పు కనపడుతోంది. తాము ‘హద్దు’ను దాటడానికీ వెనుకాడబోమని సంకేతాలిచ్చింది.

మరిన్ని వార్తలు