కన్నడలో రీమేక్ కానున్న ‘మనం’

4 Aug, 2014 02:50 IST|Sakshi
కన్నడలో రీమేక్ కానున్న ‘మనం’
  • తన కుటుంబంతో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సాయికుమార్ ఉత్సాహం
  • సాక్షి, బెంగళూరు : పూర్వ జన్మల కథాంశంతో మూడు తరాల నట వారసత్వాన్ని ఒకే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుంచడంతో పాటు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మనం’ చిత్రం  సగటు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా  మంచి వసూళ్లను సాధించింది.
     
    కాగా ఈ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు అటు టాలీవుడ్‌తో పాటు ఇటు శాండల్‌వుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు సాయికుమార్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు నటులు ఒకే తెరపై తళుక్కుమన్నారు.

    ఇక అదే విధమైన అరుదైన సినీ నేపథ్యాన్ని సాయుకుమార్ కుటుంబం కూడా సొంతం చేసుకుంది. సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ నటులుగా మాత్రమే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులే.  సాయికుమార్ తన విలక్షమైన నటన, డైలాగ్ డెలివరీతో ఎన్నో విభిన్న పాత్రల్లో వెండితెరపై మెరిశారు. తాత, తండ్రి బాటలోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు సాయుకుమార్ కుమారుడు ఆది.
     
    దీంతో మూడు తరాల సినీ వారసత్వాన్ని వెండి తెరపై మెరిపించిన ‘మనం’ సినిమా కథ తమ కుటుంబానికి సైతం సరిగ్గా సరిపోతుందని సాయికుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా కన్నడ రీమేక్ రైట్స్ పొందేందుకు సాయికుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే మూడు తరాల సినీ వారసత్వాన్ని పొందిన మరో కుటుంబాన్ని తెరపై చూసే అవకాశం శాండల్‌వుడ్ ప్రేక్షకులకు కలగడంతో పాటు మూడు తరాల సినీనటులను కలిగిన అరుదైన కుటుంబంగా కూడా సాయికుమార్ కుటుంబానికి గౌరవం లభించనుంది.
     

మరిన్ని వార్తలు