ఖమ్మం పీఠం దక్కేదెవరికి? | Sakshi
Sakshi News home page

ఖమ్మం పీఠం దక్కేదెవరికి?

Published Mon, Aug 4 2014 2:54 AM

Khammam ZP Chairman Election on August 7

* ఈనెల 7న జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక
* మారనున్న సమీకరణలు.. అందరి చూపు ఇటువైపే
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలన్నీ అయిపోయాయని రాజకీయ వర్గాలు రీఫ్రెష్ అవుతున్న వేళ ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికపైనే అందరిలో చర్చ జరుగుతోంది. విభిన్న రాజకీయ లక్షణాలు న్న ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికవుతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జడ్పీ లో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీలో ఉన్న గ్రూపు తగాదాలతో పాటు, టీడీపీయేతర పక్షాలన్నీ ఒకతాటిపైకి వస్తే జడ్పీ పీఠం దక్కించుకునే అవకాశం ఉండ డంతో సమీకరణలు ఎప్పుడు ఎలా మారుతాయోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
 
పార్టీల బలాలివి
జిల్లాలో 46 మండలాలు ఉన్నప్పటికీ జ డ్పీటీసీ సభ్యులు 44 మంది మాత్రమే ఉన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికలు జరిగిన 44 స్థానాల్లో 22 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పదింటిలో, వైఎస్సార్‌కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, సీపీఐఎంఎల్ (ఎన్డీ) మూడు స్థానాల్లో, సీపీఎం 2 చోట్ల, సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందాయి.

అయితే, జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్‌లో ముంపు ప్రాంతం కింద ఏపీలో విలీనం అయిన ఏడు మండలాలను మినహాయించారు. అందులో రెండు మండలాల్లో ఎన్నికలు జరగలేదు. ఇక ఐదు మండలాలు అటు వెళ్లిపోవడంతో పార్టీల బలాబలాల్లో మార్పులొచ్చాయి. ముంపు కింద ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేని జడ్పీటీసీల్లో ముగ్గురు టీడీపీ వారు కాగా, ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులున్నా రు.

దీంతో తాజా బలాలను లెక్కిస్తే ‘దేశం’కు 19, వైఎస్సార్ కాంగ్రెస్‌కు నలుగురు మాత్రమే ఉన్నారు. మిగిలిన పార్టీల స్థానాలు యథావిధిగా ఉన్నాయి. ఈ లెక్కన 39 మంది జడ్పీటీసీలు పాల్గొనే ఎన్నికల్లో చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యులను గెలుచుకునేందుకు ఏ పార్టీ లేదా కూటమికయినా 20 స్థానాలు అవసరం. అయితే, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు.  
 
 
టీడీపీకే చాన్స్.. కానీ..!
జడ్పీలో ప్రస్తుతమున్న బలాబలాలను పరిశీలిస్తే ఒక్క జడ్పీటీసీ మద్దతు అదనంగా లభిస్తే టీడీపీకి చెందిన అభ్యర్థిని చైర్‌పర్సన్ అయ్యే అవకాశాలు ఉన్నా యి. అయితే, ఆ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు కొంపముంచేలా ఉన్నాయి. జిల్లాలో రెండు గ్రూపులకు నేతృత్వం వహిస్తున్న తుమ్మల, నామా నాగేశ్వరరావుల మధ్య సయోధ్య కుదిరి ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి.

పార్టీ తరఫున జడ్పీ చైర్‌పర్సన్ స్థానానికి అర్హులైన వారిలో ముగ్గురు తుమ్మల వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు నామా మద్దతుదారులున్నారు. తమ వారికంటే తమవారికే జడ్పీ పీఠం దక్కాలని ఇద్దరూ పట్టుపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు అందరూ కలిసి వెళ్లి చర్చిం చినా ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నిక జరిగే రోజున ‘సీల్డ్‌కవర్’ లో అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పిన బాబు ప్రస్తుతానికి అందరు జడ్పీటీసీలతో గోదావరి జిల్లాల్లో క్యాంపు నిర్వహిస్తున్నారు.  
 
అదను కోసం ఎదురుచూపులు
టీడీపీ కాకుండా మిగిలిన పార్టీల విషయానికి వస్తే అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు తమ వ్యూహాల కన్నా టీడీపీ శిబిరం నుంచి ఏవైనా లీకులొస్తాయేమోనని ఎదురుచూస్తున్నాయి. ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ నేతలయితే అదను కోసం ఎదరుచూస్తున్నా రు. అయితే, సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోల్పోయిన నిస్పృహలో ఉన్న కాంగ్రెస్‌ను జిల్లాలో సమన్వయపరిచే నాథుడు లేకపోవడం, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్న చందం గా వ్యవహరిండడంతో పార్టీలో ఏం జరుగుతుందో.. జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీ తీరు ఏమిటో  అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ సమీకరణలపై దృష్టి పెట్టి తన నలుగురు జడ్పీటీసీలతో వ్యూ హం రచించాలని యోచిస్తోంది. అయితే, అధికార టీఆర్‌ఎస్‌కు జడ్పీలో ప్రాతినిధ్యం లేదు. అయినా.. తెర వెనుక మంత్రాంగం ఏదైనా జరుగుతుందా? కొన్ని పార్టీల మద్దతుతో, టీడీపీ నుంచి చీలిక తెచ్చి టీఆర్‌ఎస్ వెనకుండి ఏమైనా చేస్తుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో లేటుగా జరుగుతున్నా ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక లేటెస్టుగా జరుగుతుందేమోనని రాజకీయ వర్గాలు లెక్కలు కట్టుకుంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement