మరో కుట్ర

8 Nov, 2014 02:42 IST|Sakshi
మరో కుట్ర

ముల్లై పెరియార్ డ్యామ్ నీటి మట్టం పెంపును అడ్డుకునే విధంగా కేరళ సర్కారు మరో కుట్రకు సిద్ధమైంది. కుంటి సాకులతో ఆ డ్యామ్‌లో నిల్వ ఉన్న నీటి ని బయటకు విడుదల చేయించే విధంగా కోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఈ కుట్రలపై ఆ డ్యామ్ ఆధారిత జిల్లాల్లోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, చెన్నై : ముల్లైపెరియార్ డామ్ నీటి మట్టాన్ని తగ్గించేందుకు కేరళ సర్కారు కుట్రపన్నుతోంది. దీనిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యామ్‌పై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉంది. ఈ డ్యామ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ సర్కారు పలు కుట్రల్ని చేసింది. ఈ డ్యామ్ బలహీనంగా ఉందంటూ కపట నాటకాల్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తమిళుల పక్షాన నిలబడడంతో ఆ డ్యామ్ నీటి మట్టం 142 అడుగులకు పెంచే పనిలో అధికారులు పడ్డారు.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆ డ్యామ్‌లోకి నీటి రాక పెరిగింది. మరి కొద్ది రోజుల్లో నిర్ణీత స్థాయికి నీటి మట్టం చేరనుంది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆ డ్యామ్‌ను పరిశీలిస్తూ, నీటి మట్టాన్ని పెంచే పనిలో పడింది. అయితే, ఈ నీటి మట్టం 142 అడుగులకు చేరిన పక్షంలో డ్యామ్ పటిష్టతను ఎత్తి చుపుతూ 152 అడుగులకు పెంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించ వచ్చన్న భావనలో కేరళ సర్కారు పడ్డట్టుంది. దీంతో నిర్ణీత స్థాయికి నీటి మట్టం చేరకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.

ఇదో పెద్ద కుట్ర
బుధ, గురువారాల్లో  కేరళ నీటి పారుదల శాఖ అధికారులు ఆ డ్యామ్ పరిసరాల్లో రహస్య పరిశీలన జరిపి తమ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అందులో కొత్త కుట్రకు తెరలేపారు. ఆ డ్యామ్‌లోని రెండు గేట్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు, వాటికి మరమ్మతులు అనివార్యం అన్నట్టుగా వివరించారు. ఈ దృష్ట్యా, డ్యామ్‌లో నీటి మట్టాన్ని పెంచకుండా, నీటి శాతాన్ని అధికంగా నిల్వ ఉంచకుండా, బయటకు విడుదల చేయాల్సిన అవశ్యం ఉందని సూచించారు. అందుకే బుధవారం నుంచి ఆ డ్యామ్ నుంచి లక్షా 22 వేల గణపుటడుగుల నీటిని విడుదల చేయించే పనిలో పడ్డట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలకు సమాచారం అందింది.

అన్నదాతల ఆగ్రహం
ముల్లై పెరియార్ డ్యామ్ పరిసరాలు ప్రకృతి రమణీయతకు నిలయలుగా ఉన్నాయని, ఈ పరిసరాల్ని ఆక్రమించి ప్రైవేటు రిసార్ట్స్‌లు, కేరళ పర్యాటక కేంద్రాలు వెలసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ డ్యామ్ నీటి ఆధారిత తేని, విరుదునగర్, రామనాథపురం, శివగంగై, మదురై అన్నదాతల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డ్యామ్ నీటి మట్టం క్రమంగా పెరిగిన పక్షంలో ఆక్రమణల్లో వెలసిన రిస్టార్స్‌లకు ఇబ్బందులెదురయ్యేప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించే కేరళ కొత్త కుట్రకు తెరలేపిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మూడు వేల ఎకరాల్లో ఈ రిసార్ట్స్‌లు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వీటిని త్వరితగతిన అడ్డుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నీటిని లక్షల గణపుటడుగుల మేరకు విడుదల చేయడం వలన డ్యామ్ నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గురువారానికి డ్యామ్ నీటి మట్టం 138 అడుగుల్ని దాటింది. అందుకే, కొత్త కుట్రతో కోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో కేరళ ఉందని మండి పడుతున్నారు.

కేరళ చర్యల్ని అడ్డుకునే విధంగా రాష్ట్ర ప్రజా పనుల శాఖ చర్యల్ని వేగవంతం చేయాలని, ముల్లై పెరియార్ పరిసరాల్లో కేరళ చెక్ పోస్టుల్ని తొలగించి, తమిళ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయాలని, ఆక్రమణకు గురైన ప్రాంతాల్ని తిరిగి తమిళనాడు గుప్పెట్లోకి తీసుకురావాలని అక్కడి అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేరళ కుట్రల్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజా పనుల శాఖ అధికారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అమరావతి డ్యామ్‌కు నీళ్లు రాకుండా ఆ పరిసరాల్లో కొత్త డ్యామ్ ప్రయత్నాల్లో కేరళ ఉన్నట్టు వచ్చిన సమాచారంతో ఆ విషయంగా లోతైన పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. ఈ పనులు పూర్తి కాగానే, ముల్లై పెరియార్ వ్యవహారంపై కేరళతో ఢీ కొట్టేందుకు కసరత్తులు చేపట్టబోతున్నారు.

మరిన్ని వార్తలు