బీజేపీపై నటి ఆరోపణలు

27 Apr, 2017 11:45 IST|Sakshi
బీజేపీపై నటి ఆరోపణలు

టీనగర్‌: తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ ఆరోపించారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కుష్బూ మంగళవారం కలిసి మాట్లాడారు. ఈ భేటీ గురించి కుష్బూ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి రాహుల్‌గాంధీకి వివరించానని తెలి పారు.

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీతో అన్నాడీఎంకే కూటమి ఏర్పరచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. అయితే ఇలా దొడ్డిదారిన ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, అది కలగానే మిగిలిపోతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు. తమిళనాట రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టేందుకు బీజేపీ పథకం రూపొందిస్తోందన్నారు.

బీజేపీ కలలు ఫలించవు: దురైమురుగన్‌
రాష్టంలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ పగటి కలలు ఫలించబోవని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ తెలిపారు. రాష్ట్ర రైతుల 19 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ డీఎంకే తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ డీఎంకేపై, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై అనుచిత ప్రకటనలు చేస్తున్నట్లు విమర్శించారు.

మరిన్ని వార్తలు