తప్పిన పెను ప్రమాదం

25 May, 2014 23:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: వ్యాసార్పాడి-బీచ్ స్టేషన్ మార్గంలో పట్టాలు పలు చోట్ల ధ్వంసమైన విషయూన్ని ఈఎంయూ రైలు డ్రైవర్ సకాలంలో గుర్తించారు. పరుగులు తీస్తున్న రైలు అర్ధాంతరంగా ఆగడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తరచూ పగుళ్లకు గురవుతున్నాయి. ఈ పగుళ్లతో కొన్ని సందర్భాల్లో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. దీంతో రైలు సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆదివారం ఏకంగా పది చోట్ల పట్టాలు దెబ్బతినడం ప్రయూణికులను మరింత ఆందోళనలో పడేసింది. ఆదివారం సాయంత్రం తిరుత్తణి - బీచ్ మార్గంలో ఓ గూడ్స్ రైలు వెళ్లింది. ఆ రైలు వెళ్లిన కాసేపటికి బీచ్ నుంచి తిరువళ్లూరు, అరక్కోణం మీదుగా తిరుత్తణికి ఈఎంయూ రైలు బయలు దేరింది. వ్యాసార్పాడి -బీచ్ మార్గంలోని కొరుక్కు పేట సమీపంలో వేగంగా పరుగులు తీస్తున్న రైలు హఠాత్తుగా ఆగింది. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
 
 ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో రైలు ఆగగానే కొన్ని బోగీల్లోని ప్రయాణికులు కిందకు దిగేశారు. అయితే, కొన్ని బోగీలు వంతెన మీద ఉండటంతో అందులోని ప్రయాణికులు కిందకు దిగ లేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా కిందకు దించారు. గూడ్స్ రైలు చక్రాల్లో తలెత్తిన లోపమో ఏమోగానీ పది చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బ తిని ఉండడాన్ని ఈఎంయూ డ్రైవర్ గుర్తించారు. అక్కడక్కడ రాచుకుపోయినట్టుగా ట్రాక్ దెబ్బ తిని ఉండటం వల్లే ఈఎంయూను హఠాత్తుగా నిలిపేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆ మార్గంలో ఈఎంయూ సేవలు ఆగాయి. ఆగమేఘాలపై రైల్వే సిబ్బంది మరమ్మతుల్లో నిమగ్నం అయ్యారు.

 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా