అస్త్రశస్త్రాలతో రెఢీ

22 Jun, 2014 03:16 IST|Sakshi
  • రేపటి నుంచి వర్షా కాల సమావేశాలు
  •  లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారి
  •  కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో  దూకుడు మీదున్న బీజేపీ నేతలు
  •  ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతం
  •  కేబినెట్ విస్తరణ లేకపోవడంతో ‘అసంతృప్తి’
  •  కాంగ్రెస్ నేతల్లో అనైక్యత
  •  తలనొప్పిగా మారిన చెత్త సమస్య
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ వర్షా కాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 27 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు ఇవే. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించగా, అధికార కాంగ్రెస్ ఒకే అంకెకు పరిమితం కావాల్సి వచ్చింది. రైల్వే లాంటి కీలక శాఖ కూడా రాష్ట్రానికే దక్కడంతో బీజేపీ జోరు మీద ఉంది.

    పాలన మందకొడిగా సాగుతోందని, మంత్రుల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణల మధ్య అధికార కాంగ్రెస్‌కు ఈ సమావేశాలు నల్లేరు మీద నడక కాబోవు. అదనపు డీజీపీ డాక్టర్ రవీంద్ర నాథ్ ఓ కాఫీ షాపులో యువతి ఫొటోలు తీశారన్న ఆరోపణలపై పోలీసు శాఖలో ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌పై ఆయన పలు ఆరోపణలు చేయడంతో సీఐడీ దర్యాప్తు చేయాల్సి వచ్చింది.

    పోలీసు శాఖలో ఈ విధంగా రాజకీయాలు చోటు చేసుకుంటే శాంతి భద్రతల పరిరక్షణ ఎలాగంటూ ఇదివరకే బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉద్యాన నగరిగా పేరొందిన బెంగళూరులో చెత్త సమస్య నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది. తమ గ్రామం వద్ద చెత్త పారబోయవద్దని మండూరు వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరకు ప్రభుత్వం ఎలాగో బతిమలాడి మరో ఐదు నెలలు మాత్రమే అక్కడ చెత్త పారబోస్తామని, ఆలోగా వేరే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేసింది.

    హైకోర్టు కూడా చెత్త సమస్యపై ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇచ్చినా ఈ సమస్యను పరిష్కరించ లేకపోయిందని నిష్టూరమాడింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెత్త సమస్యపై అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనేక వాగ్బాణాలు సంధించారు. ఇప్పుడు అవే విమర్శలను ఆయన బీజేపీ నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది.

    కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు లాడ్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై నిలదీయడానికి జేడీఎస్ సన్నద్ధమవుతోంది. అవసరమైతే సభలో పోరాటాలకు కూడా సిద్ధం కావాలని నిర్ణయించింది. ఇక శాఖల వారీ డిమాండ్లపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాల్సి ఉంది. కనుక ఈ సమావేశాలు పాలక కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షే.
     
    ఇప్పటికే సభలో ప్రతిపక్షాల విమర్శలకు అధికార బెంచీల నుంచి సరైన సమాధానాలు లభించడం లేదు. ఎవరికి వారు తమకేం పట్టిందిలే అని వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవులు రాని వారు, కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవులను ఆశిస్తున్న వారు... ఇలా ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి దశలో ప్రతిపక్షాలను సభలో కాంగ్రెస్ సమైక్యంగా ఎదుర్కొంటుందా...అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
     

>
మరిన్ని వార్తలు