తేజస్‌లో మోదీ

26 Nov, 2023 05:21 IST|Sakshi

సాక్షి బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)కు చెందిన తయారీయూనిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.

పైలట్‌ యూనిఫామ్‌ ధరించి  తేజస్‌ యుద్ధ విమానంలో సుమారు 10 నిమిషాల పాటు ప్రయాణించారు. తన యుద్దవిమాన ప్రయాణం తాలూకు ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘తేజస్‌లో ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణ అనుభవం భారతదేశ దేశీయ సామర్థ్యాలపై నా నమ్మకాన్ని మరింతగా పెంచింది. దేశీయ టెక్నాలజీ, వైమానిక సత్తా, కృషి, అంకితభావం చూస్తే గర్వంగా ఉంది. స్వావలంబనలో ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్‌ తీసిపోదు. భారతీయులుగా మనందరం ఈ విషయంలో భారత వాయుసేన, డీఆర్‌డీవో, హాల్‌ను అభినందించాల్సిందే’’ అని మోదీ ట్వీట్‌చేశారు. విమాన ప్రయాణం తర్వాత హాల్‌లోని తయారీ కేంద్రం పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు