అదనపు కట్నం కేసులో అత్తమామలకు జైలు

24 Sep, 2014 22:13 IST|Sakshi

 న్యూఢిల్లీ: అదనపు కట్నం తేవాలని కోడల్ని వేధించి, ఆమె మృతికి కారకులైన అత్తమామలకు ఢిల్లీ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసు విచారించిన అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ కుమార్ గోయల్ నేరం రుజువుకావడంతో ఈ మేరకు తీర్పు చెప్పారు. బాధితురాలి  అత్తమామ కృష్ణ ఆనంద్, వీణలపై వరకట్నపు వేధింపులకు పాల్పడినట్లు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు కారు కావాలని, ఇందుకోసం అదనపుకట్నం కావాలని నిత్యం వేధించడం వల్లనే బాధితురాలు  ఇంటి భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
 
 వివాహమైన ఏడు సంవత్సరాల తరువాత కారు డిమాండ్ చేస్తూ క్రూరంగా, అవమానవీయంగా బాధితురాల్ని వేధించడంతో తీవ్ర మానసికక్షోభకు గురై మృతి చెందినట్లు రుజువైనందున ఈ మేరకు దోషులకు ఒకొక్కరికి ఐదేళ్ల జైలు, బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 25,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. కాగా ఈ కేసు నుంచి బాధితురాలి భర్తపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నిర్దోషిగా భావిస్తూ విముక్తి కల్పించారు. అయితే బాధితురాలి భర్త ఆమెను కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించలేకపోయాడని, కుటుంబంలో భార్య ఆత్మగౌరవాన్ని, స్థానాన్ని కాపాడడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల తీవ్ర వేధింపుల వల్లనే బాధితురాలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు పూర్వపరాలిలా ఉన్నాయి..
 
 నవంబర్ 20, 2005లో బాధితురాలు  ఇంటి భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని,ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారని, ఆమె అత్తమామలు బాధితురాలి సోదరునికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె భరత్తతోపాటు అత్తమామ అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే 13 నెలల కుమారుడితోపాటు ఇంటి భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె కుమారుడిని వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేశారని,ప్రస్తుతం కోలుకొంటున్నాడని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష ఖరారు చేసినట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు