విష సరస్సులు!

9 Mar, 2016 02:05 IST|Sakshi
విష సరస్సులు!

= అందులో నీరు కాదు కాసారం
= పట్టించుకోని అధికారులు
= శుద్ధి చేసినా తాగలేము !
= హలసూరు చెరువులో మృత్యువాత పడిన చేపలే నిదర్శనం

 
బెంగళూరు: బెంగళూరు పేరు చెప్పగానే పరవశింపజేసే పచ్చని ప్రకృతితో పాటు దాహార్తిని తీర్చే స్వచ్ఛమైన సరస్సులు కళ్లముందు కదలాడతాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. అభివృద్ధి పేరుతో నగరంలోని చెట్లన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నట్లే స్వచ్ఛమైన సరస్సులు కూడా నీటితో కాకుండా విషపూరితమైన వ్యర్థాలతో నిండి విషతుల్యంగా మారిపోతున్నాయి. నగరంలోని సరస్సుల్లోని నీరు ఎంతగా విషతుల్యంగా మారిపోయిందంటే సరస్సుల వద్ద ఉన్న శుద్ధీకరణ ప్లాంట్‌లలో నీటిని శుద్ధి చేసిన తర్వాత పరీక్షించి చూసినా కూడా అవి ఏమాత్రం తాగడానికి పనికిరావని కర్ణాటక రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (కేఎస్‌పీసీబీ) ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేలింది. హలసూరు చెరువులోని లక్షలాది చేపలు నిర్జీవంగా గట్టుకు చేరుకున్న సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న చెరువుల కాలుష్య కారకాలపై మరోసారి విస్తృత చర్చ సాగుతోంది.

అన్ని సరస్సుల్లోనూ ఇదే పరిస్థితి.....
నగరంలోని అగరా, హులిమావు, పుట్టనహళ్లి, లాల్‌బాగ్, యడియూరు, ఉలసూరు, వర్తూరు తదితర 48 సరస్సుల్లోని నీరు సైతం పూర్తిగా విషపూరిత కాలుష్య కారకాలతో నిండిపోయింది. ఇక ఈ సరస్సుల వద్ద నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఉన్నప్పటికీ శుద్ధీకరణ తర్వాత కూడా ఈ నీరు కనీసం పశువులు తాగేందుకు కూడా పనికిరాని పరిస్థితిలో ఉందంటే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నగరంలోని మరికొన్ని సరస్సులు సైతం ప్రస్తుతం కాలుష్య కారకాలతో అధ్వాన్న స్థితికి చేరుకుంటున్నాయి. వాటిలో కమ్మసంద్ర, చందాపుర, ెహ బ్బగోడి, శాంకీట్యాంక్, మహదేవపుర, బేగూరు, హుళిమావు, కగ్గదాసపుర, హెబ్బాళ-జెక్కూరు, శివపుర, బెళ్లందూరు, సోమసుందరపాళ్య, బట్టరహళ్లి, రాయసంద్ర, బొమ్మసంద్ర, నల్లూర్‌హళ్లి, వర్తూరు, బ్యారసంద్ర, ఉలసూరు, హరలకుంటె, వర్తూరు సరస్సులు ఉన్నాయి.
 
కారణాలేమిటి....
ఒకప్పుడు మంచినీటి సరస్సులుగా ఉన్న ఈ సరస్సులన్నీ ఇప్పుడు విషతుల్యమైన నీటితో నిండడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన  కారణమని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో సరస్సులు కబ్జాకు గురవుతున్నా, డ్రె యినేజీ నీళ్లు, చెత్తా చెదారాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు ఇలా కాలుష్య కారకాలన్నీ సరస్సుల్లోకి చేరిపోతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మంచి నీటితో కళకళలాడుతూ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన సరస్సులు కాస్తా విషపూరితమైన నీటితో నిండి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఇక ప్రస్తుతం నగరంలోని వివిధ సరస్సుల్లోని నీరు చాలా వరకు ‘ఈ’ కేటగిరీలోనే ఉంది. అసలు ఏయే కేటగిరీల్లోని నీటిని ఏ అవసరాలకు వినియోగించుకోవచ్చునే ఒక్కసారి పరిశీలిస్తే.....  ఏ కాటగిరీ- ఈ కేటగిరీలోని నీటిని కేవలం సాంప్రదాయ వడపోత తర్వాత తాగవచ్చు బి కేటగిరీ- ఈ కేటగిరీలోని నీటిని సంప్రదాయ వడపోతతో పాటు క్రిమిసంహారకాలకు సంబంధించిన శుద్దీకరణ(డిస్‌ఇన్‌ఫెక్షన్ ట్రీట్‌మెంట్) కూడా చేయాల్సి ఉంటుంది సి కేటగిరీ- ఈ కేటగిరీలోని నీరు కేవలం స్నానాలు, బట్టలు ఉతకడం, వంటి పనులకు వినియోగించవచ్చు  డి- పశువులు తాగేందుకు, చేపల పెంపకం వంటి వాటికి ఈ కేటగిరీలోని నీటిని వినియోగించవచ్చు  ఈ-పంట పొలాలకు, ఇండస్ట్రియల్ క్లీనింగ్, కూలింగ్ వంటి వాటిలో ఈ నీటిని వాడేందుకు వీలవుతుంది
 
 
 

మరిన్ని వార్తలు