-

కరెంటు కహానీ!

26 Dec, 2013 23:06 IST|Sakshi
న్యూఢిల్లీ:తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) ఖాతాలను ఆడిటింగ్ చేయిస్తామన్న ఆప్  ప్రకటనపై దేశవ్యాప్త చర్చ  జరుగుతోంది. డిస్కమ్ ఖాతాలకు స్వతంత్ర సంస్థతో ఆడిటింగ్ చేయిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని, టారిఫ్ తగ్గింపు సాధ్యమేనని ఆప్ బలంగా వాదిస్తోంది. ప్రభుత్వ అధీనంలోని కంప్ట్రోలర్ అండ్ జనరల్  లేదా ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ నిర్వహించి టారిఫ్ తగ్గించే పరిస్థితి ఉన్నదీ లేనిదీ నిర్ధారించాల్సి ఉంటుంది. రాజధానిలోని డిస్కమ్‌ల ఖాతాలపై ఆడిటింగ్‌కు డిమాండ్ చేస్తూ ఆప్ ఇది వరకే పలుసార్లు యాజమాన్యాలకు నివేదికలు పంపించింది. ఈ నేపథ్యంలో  రెండు వర్గాల వాదనలు ఇలా ఉన్నాయి.
 
 బీఎస్‌ఈఎస్ రాజధాని వాదన
 తమ ఆదాయంలో 80 శాతం కరెంటు కొనుగోళ్లకే వెళ్లిపోతోందని బీఎస్‌ఈఎస్ రాజధాని వాదిస్తోంది. విద్యుత్ కొనుగోలుకు ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ కరెంటు ఉత్పత్తి కేంద్రాలతో ఒప్పందాలు కుదుర్చోవడం వంటి ఈ విషయంలో తనకు ఎలాంటి నియంత్రణా ఉండబోదు. 2003 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు విద్యుత్ టోకు ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి. 2003లో యూనిట్‌కు రూ.1.42 చెల్లించగా, ఇప్పుడు రూ.5.71 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలకు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) ఆమోదం కూడా ఉంది కాబట్టి తప్పుడు నివేదికలు ఇచ్చేందుకు అవకాశమే లేదు. నిజానికి గత పదేళ్లలో కరెంటు చార్జీలు పెరిగింది 65 శాతం మాత్రమేని ఇది తెలిపింది.  2003లో యూనిట్‌కు రూ.3.06 చెల్లిం చగా, ఇప్పుడు రూ.6.55 చెల్లించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా ధరలు భారీగా పెరిగాయి. అంతకుముందు ఐదేళ్లుగా డిస్కమ్‌లు తక్కువ చార్జీలు వసూలు చేశాయి. నగరంలోని డిస్కమ్‌లపై ఇప్పటికీ రూ.20 వేల కోట్ల భారం ఉందని రాజధాని వాదిస్తోంది. గత పదేళ్లలో వినియోగ ధర సూచిక 120 శాతం పెరిగిందని, ఆ ప్రకారం యూనిట్ ధర రూ.7.40 ఉండాని పేర్కొంది. 
 
 ఇదీ ఆప్ వాదన...
 అయితే బీఎస్‌ఈఎస్ వాదనలో ఎన్నో లోపాలున్నాయని ఆప్ వాదిస్తోంది. పదేళ్లలో కరెంటు ధరలు 300 శాతం పెరిగితే, డిస్కమ్‌లు కేవలం 65 శాతం పెంపుతో సర్దుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. పైగా నగరంలో కరెంటు చౌర్యం తక్కువేమీ కాదు. బీఎస్‌ఈఎస్ వాదన ప్రకారం కరెంటు చౌర్యం, లీకేజీలు ఒకప్పుడు 57 శాతం ఉండగా, దానిని డిస్కమ్‌లు రికార్డుస్థాయిలో 17 శాతానికి తగ్గించాయట! గణాంకాల్లో చెప్పాలంటే విద్యుత్ పొదుపు వల్ల డిస్కమ్ 2003 నుంచి 2013 వరకు రూ.37,500 కోట్లు (ఏడాదికి రూ.7,500 కోట్లు) ఆదా చేశాయి. అంటే ఇది ఢిల్లీ వార్షిక బడ్జెట్‌లో 25 శాతం! ఇలా ఆదా చేశాం కాబట్టే సబ్సిడీలను భరిస్తున్నామన్నది డిస్కమ్‌ల వాదన. ఈ వాదనలన్నీ తప్పని పేర్కొంటూ కేజ్రీవాల్ డీఈఆర్సీ, ప్రభుత్వానికి పలు నివేదికలు సమర్పించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. విద్యుత్ కంపెనీలు తమకు 2010-2011 ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్ల నష్టాలు వచ్చాయని ప్రకటించుకున్నాయి. అయితే అప్పటి డీఈఆర్సీ చైర్మన్ బ్రిజేందర్ సింగ్ డిస్కమ్‌లు రూ.3,577 కోట్ల లాభాలు ఆర్జించాయి కాబట్టి, టారిఫ్‌ను 23 శాతం తగ్గించవచ్చని ప్రకటించారు. ఈ ప్రతిపాదన నచ్చని అప్పటి షీలా ప్రభుత్వం సింగ్‌ను తొలగించి కొత్త వ్యక్తిని చైర్మన్‌గా నియమించింది. ఆయన టారిఫ్‌ను తగ్గించడానికి బదులు 22 శాతం పెంచడానికి అంగీకరించారు.
 
 విద్యుత్ పంపిణీ నష్టాలపై డిస్కమ్‌లు చెబుతున్న లెక్కలు ఎంతమాత్రమూ సహేతుకంగా లేవని ఆప్ వాదిస్తోంది. కంపెనీల నుంచి భారీ రేట్లకు కరెంటు కొంటున్నామని చెబుతున్న డిస్కమ్‌లు వాటి అనుబంధ సంస్థలకు మాత్రమే చౌకరేట్లకు దానిని అమ్మడం గమనార్హం. సింగ్ ప్రతిపాదనలు అమలైతే రూ.100 చెల్లించే వినియోగదారుడి బిల్లు రూ.77కు తగ్గేది. ఇప్పుడది రూ.161కి చేరుకుంది. అంటే నెలకు 200 యూనిట్లు వాడుకుంటే రూ.503 చెల్లించాల్సి ఉండగా, ఇపుపడు ఏకంగా రూ.1,505 కట్టాల్సి వస్తోంది. ఈ రెండు వర్గాలు వాదనల్లో వైరుద్ధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆడిటింగ్‌కు ఆదేశిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఇది సాధ్యమైనంత త్వరగా జరగాలని ఆశిద్దాం. 
 
మరిన్ని వార్తలు