మురికివాడల్లో కనీస సౌకర్యాలు కల్పించండి

8 May, 2014 23:11 IST|Sakshi

న్యూఢిల్లీ: నగర శివారుల్లో ఉన్న మురికివాడల్లో ప్రజానీకానికి వసతులు కల్పించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లాల నేతృత్వంలోని ధర్మాసనం...  ఈ అంశంపై జూలై రెండో తేదీన నివేదిక ఇవ్వాలని కోరింది. పాత ఢిల్లీలోని పుల్ మిథాయి ప్రాంతంలోగల మురికివాడల్లోని ప్రజానీకం అత్యంత దుర్భరమైన, అమానవీయ పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అభితి గుప్తా తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతంలో కేవలం ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన ఇళ్లలో బతుకుతున్నారని పేర్కొన్నారు. తాగునీరు లేదని, పారిశుధ్యం అసలే లేదని, పూర్తిగా పేదరికంలో అనారోగ్య వాతావరణంలో నివసిస్తున్నారని తెలిపారు.
 
 అనేక మందికి ఇళ్లులేకపోవడంతో దశాబ్దాలుగా ఇలాగే తమ జీవితాన్ని గడుపుతున్నారని, వారిలో కొందరు ఇళ్ల నిర్మాణ రంగంలో కార్మికులుగా కొనసాగుతుండగా, మరికొందరు కూరగాయల మార్కెట్లలో పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వ పథకాలేవీ చేరడం లేదని, ప్రాథమిక చికిత్స కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులకు పోషకాహారం లభించడం లేదని, దీనివల్ల శిశుమరణాలు, గర్భస్థ శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జననీ శిశు సురక్షా కార్యక్రమం, రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన, జన నీ సురక్షా యోజన, ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ పథకాలను ఇక్కడి స్త్రీలకు కూడా కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని షకీల్ అహ్మద్ అనే వ్యక్తి దాఖలు చేశారు.
 
 హాకర్లపై వేధింపుల కేసులో తీర్పు రిజర్వ్
 తమ హక్కులు కాపాడాలంటూ ఢిల్లీలోని హాకర్లు (రోడ్డుపక్కన వ్యాపారం చేసేవారు) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వ్ చేసింది. పోలీసులు తమను వేధిస్తున్నారని, తాము కూర్చునే చోట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెత్తను పోగు చేస్తున్నారని, ఓఖ్లాలోని సబ్జీమండి ప్రాంతంలో వేసిన చెత్తను తీసేయించాలంటూ హాకర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జయంత్‌నాథ్‌ల బెంచ్ తీర్పును నిలిపివేసింది. సమస్యను తమకు తామే పరిష్కరించుకోవాలని హాకర్లకు సూచించిన కోర్టు... లేకపోతే సమస్య మరింత సాగుతుందని తెలిపింది.
 
 చిన్న వ్యాపారుల హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ శ్రామిక్ సంఘటన్ తరపు న్యాయవాది ఇందిరా ఉన్నియార్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు... పిటిషనర్, ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎమ్సీడీ) సమర్పించిన దస్తావేజులు, చిత్రాలు, వీడియోలను పరిశీలించిన తరువాత తీర్పు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో హర్కేష్‌నగర్ సబ్జీమండిలోని 130 మంది హాకర్లు దాఖలు చేసిన పిటిషన్‌లో... స్థలాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు తమను వేధిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని హాకర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దానికితోడు తాము కూర్చునే ప్రాంతాల్లోనే ఎమ్సీడీ చెత్తను వేస్తూ తమ జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తోందని ఆరోపించారు. హాకర్లను నెలకు రూ. 500 చెల్లించాలంటూ వేధిస్తున్నారని హాకర్ల తరఫు న్యాయవాది ఇందిర.. కోర్టుకు వివరించారు. ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని వేరే వ్యాపారస్తులకు అక్కడ చోటిస్తున్నారని, వారిని రక్షించినందుకుగాను నెలకు రూ. 1,000 కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు. హాకర్లను వేధించొద్దన్న కోర్టు ఆదేశాలను పోలీసులు, ఎమ్సీడీ ఖాతరు చేయడం లేదని తెలియజేశారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా