‘రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’

29 Oct, 2013 01:01 IST|Sakshi

శివమొగ్గ, న్యూస్‌లైన్ : ముస్లిం యువకులకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ సంస్థతో సంబంధాలు ఉన్నాయంటూ ఏఐసీసీ జాతీయ ఉధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం సోషియల్ డెమెక్రటిక్ పార్టీ ఆప్ ఇండియా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యూపీలోని ముజఫర్ నగర్‌లో ఇటీవ ల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో రాహుల్ ఇలాంటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సమంజసం కాదని ఎస్‌డీపీఐ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఎస్‌డీపీఐ జిల్లా అధ్యక్షుడు విజాన్‌పాషా మాట్లాడుతూ ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ముజఫర్ నగర్ సంఘటనను ప్రస్తావిస్తూ ముస్లిం యువకులు పాకిస్తాన్ ఐఎస్‌ఐ సంస్థతతో సంబంధాలు ఉన్నాయంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముజఫర్‌నగర్ బాధితులకు ప్రభుత్వం సాయం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్ ముజఫర్‌నగర్ సంఘటనను రాజకీయ స్వార్థానికి వాడుకుని పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ వివాదాస్పద రాజకీయాలకు, కాంగ్రెస్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. తక్షణం రాహుల్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని, లేకుం టే భవిష్యత్‌లో భారీ ఆందోళనలు చేపడతామని విజాన్‌పాషా హెచ్చరించారు. ధర్నాలో ఎస్‌డీపీఐ కార్యకర్తలు బషీర్‌అహ్మద్, అబ్దుల్ ముజీద్, మహమ్మద్‌నాజీమ్, రాజిక్‌పాషా, అల్లాబక్ష్, ఖలీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు