మంటలు రేపిన..మాక్‌ పార్లమెంట్‌!

20 Dec, 2023 01:34 IST|Sakshi

సస్పెన్షన్లపై పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన 

రాజ్యసభ చైర్మన్‌ను వ్యంగ్యంగా అనుకరించిన ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

వీడియో తీసిన రాహుల్‌గాంధీ 

మానసిక క్షోభకు గురయ్యా: ధన్‌ఖడ్‌ 

నా కులాన్ని, నేపథ్యాన్ని కించపరిచారు 

అత్యంత సిగ్గుచేటంటూ మండిపాటు

నవ్వుల్లో మునిగిన ఎంపీలు, వీడియో తీసిన రాహుల్‌ 

దారుణమైన మానసిక క్షోభకు గురయ్యా: ధన్‌ఖడ్‌ 

విపక్షాల సంస్కారానికి నిదర్శనం: బీజేపీ

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల నుంచి తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీసింది. విపక్ష ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం మెట్లపై మాక్‌ పార్లమెంటు నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాందీతో పాటు పలు విపక్షాల సభ్యులు అందులో పాల్గొన్నారు.

మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అచ్చంగా సభల్లో మాదిరిగానే సభ్యులంతా నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ సభల నుంచి విపక్ష సభ్యులను భారీగా సస్పెండ్‌ చేస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు.

పాలక పక్షానివి నియంతృత్వ పోకడలంటూ దుమ్మెత్తిపోశారు. పార్లమెంటులో అధికార పక్షానికి చెందిన సభ్యుల వ్యవహార శైలిని వ్యంగ్యంగా అనుకరించారు. ఆ క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ ఉన్నట్టుండి లేచి నిలబడి రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ నడక తీరును, హావభావాలను, ఆయన సభను నిర్వహించే తీరును రకరకాలుగా అనుకరిస్తూ ఎద్దేవా చేశారు.

అచ్చం ధన్‌ఖడ్‌ మాదిరిగానే కాస్త వెనక్కు వంగి నిలబడి, ‘వెన్నెముక’ అంటూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులంతా నవ్వుతూ ఆయన్ను ప్రోత్సహించగా దీన్నంతటినీ రాహుల్‌ తన సెల్‌ ఫోన్లో వీడియో తీస్తూ కని్పంచారు. మరికొందరు విపక్షసభ్యులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను నడిపే తీరును కూడా వ్యంగ్యంగా అనుకరిస్తూ ఆటపట్టించారు. ఇదంతా టీవీ చానళ్లలో లైవ్‌గా ప్రసారమైంది. ముఖ్యంగా ధన్‌ఖడ్‌ను బెనర్జీ అనుకరించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సిగ్గుచేటు: బీజేపీ 
విపక్షాల తీరుపై బీజేపీ మండిపడింది. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారరాహిత్యం అట్టడుగుకు దిగజారిందన్నారు. ప్రజాస్వామిక విలువల పరిరక్షకుడినని చెప్పుకునే రాహుల్‌ తీరు ప్రజాస్వామ్యానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు, దేశానికి సిగ్గుచేటంటూ ఆక్షేపించారు.

వెనకబడ్డ సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత రాజ్యాంగ పదవులను అధిష్టించిన వారిని అవమానించడం ఇండియా కూటమి సంస్కృతి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు. ‘‘ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ను అవమానించి తీరు ఇందుకు తాజా నిదర్శనం. ఓబీసీ అయిన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు ఎంతగా అవమానిస్తున్నదీ దేశమంతా చూస్తూనే ఉంది. ఈ విషయంలో రాహుల్‌ను కోర్టు దోషిగా కూడా తేలి్చంది. రాష్ట్రపతి ముర్మును కూడా అదీర్‌ రంజన్‌ చౌధరి రాష్ట్రపత్ని  అంటూ అవమానించారు’’ అన్నారు.

తీరని అవమానం: ధన్‌ఖడ్‌ 

విపక్ష సభ్యుల ప్రవర్తన అత్యంత దారుణ, సిగ్గుచేటు అంటూ రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. ఉదయం రెండుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్‌ ఎంపీ దిగి్వజయ్‌సింగ్‌ నినాదాలకు దిగగా కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. విపక్ష ఎంపీలు తనను అనుకరిస్తూ ఎద్దేవా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, పరస్పర విమర్శలు సహజమే. కాకపోతే రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ వంటి వ్యవస్థలపై కనీస గౌరవం చూపాలి. కానీ నేనిప్పడే చానళ్లలో చూశా. చైర్మన్‌ను, స్పీకర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక ఎంపీ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీ పార్టీ సీనియర్‌ నాయకుడు (రాహుల్‌) దాన్ని వీడియో తీస్తున్నాడు.

ఆయన మీకంటే పెద్ద నాయకుడు. ఇది చాలా దారుణం. అభ్యంతరకరం. అత్యంత సిగ్గుచేటు. ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేనికైనా ఒక హద్దుంటుంది! కానీ ఈ దిగజారుడుతనానికి హద్దంటూ లేదా? మీకు సద్బుద్ధి కలగాలని ఆశించడం తప్ప ఏం చేయగలను?’’ అంటూ మండిపడ్డారు. అనంతరం మరో కాంగ్రెస్‌ సభ్యుడు పి.చిదంబరాన్ని ఉద్దేశించి కూడా ధన్‌ఖడ్‌ తన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యసభ చైర్మన్‌ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఒకరు వ్యంగ్యంగా అనుకరిస్తుంటే, ఇంకొకరు వీడియో తీస్తుంటే చూసి నా హృదయం ఎంతగా క్షోభిల్లి ఉంటుందో మీరే ఊహించండి! దేశాన్ని చిరకాలం పాటు పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్‌ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం దారుణం.

మిస్టర్‌ చిదంబరం! ఏమిటిది? మీకో విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఈ ఉదంతంతో నా మనసు ఎంతగానో గాయపడింది. పైగా ఆ వీడియోను మీ పార్టీ ఇన్‌స్టా్రగాంలో, పార్టీ ట్విటర్‌లో కూడా పెట్టారు. తద్వారా నా రైతు నేపథ్యాన్ని, ఒక జాట్‌గా నా సామాజిక నేపథ్యాన్ని, రాజ్యసభ చైర్మన్‌గా నా హోదాను... ఇలా అన్నింటినీ తీవ్రంగా అవమానించారు’’ అంటూ ధన్‌ఖడ్‌ తీవ్రంగా ఆక్షేపించారు.   

>
మరిన్ని వార్తలు