పాత ఫ్లైఓవర్లకు మరమ్మతులు

18 Dec, 2013 23:54 IST|Sakshi

న్యూఢిల్లీ, డిసెంబర్18: నగరంలోని పదేళ్లకు పైబడిన ఫ్లైఓవర్లన్నింటినీ తనిఖీ చేసి అవసరమైనవాటికి మరమ్మతులు జరిపించాలని పీడబ్ల్యూడీ నిర్ణయించింది. రాజాగార్డెన్ ఫ్లైఓవరుపై మరమ్మతు పనులు ఇప్పటికే మొదలు కాగా డిఫెన్స్ కాలనీ, మోతీబాగ్, ఆశ్రం తదితర ఫ్లైఓవర్లకు కూడా త్వరలో మరమ్మతు పనులు చేస్తారని అంటున్నారు. వాహనాల రద్దీ అధికం కావడం వలన ఫ్లైఓవర్లపై  జాయింట్లు, బేరింగ్‌లు దెబ్బతింటాయని, అందుకే వీటిని తనిఖీ చేసి మరమ్మతులు చేయాలనుకుంటున్నామని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు. ఢిల్లీలో దాదాపు 90 ఫ్లైఓవర్లు ఉన్నాయి.  

25 ఫ్లైఓవర్లు గత ఐదేళ్ల క్రితం నిర్మించినవి కాగా మిగతావి పాతవి. పాత ఫ్లైఓవర్లను తనిఖీ చేసిన తరువాత  దెబ్బతిన్నవాటిని ఎలా మరమ్మత్తు చేయాలనేదానిపై సలహా కోసం కన్సల్టెంట్లను నియమిస్తామన్నారు. ఫ్లైఓవర్లపై  మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను మరో రూటుకు మళ్లించవలసి ఉంటుంది. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసుల అనుమతి తీసుకోవలసిఉంటుంది. 25 సంవత్సరాల కిందట నిర్మించిన రాజాగార్డెన్ ఫ్లైఓవర్‌పై మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను ఇప్పటికే మళ్లించారు. మోతీబాగ్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను మళ్లించడానికి ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. కానీ ఇప్పటికే మెట్రో నిర్మాణపనుల వల్ల ఆ రూట్లో ట్రాఫిక్ నత్తనడకన నడుస్తున్నందున  మరమ్మతు పనులను మొదలుపెట్టలేదు.

>
మరిన్ని వార్తలు