నేడు వరల్డ్ హార్ట్ డే

28 Sep, 2013 22:57 IST|Sakshi
న్యూఢిల్లీ: ‘గుండె గది ఖాళీ.. ఉండిపోతావా..’ అంటూ పాత సిని మాలోలా పాట పాడుకోవాలన్నా.. ‘గుండె జారి గల్లంతయ్యిం దే..’ అని కొత్త సినిమా పాటను హమ్ చేయాలన్నా నిజంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి కదా..! ‘గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి వ్యాయామం చేయాలనే మీమాంస చాలామందిలో ఉంటుంది.. అయితే దానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. మీరు చేసే ఏ వ్యాయామమైనా గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది..’ అని గుండెజబ్బుల నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి గుండెజబ్బులపై చాలామందికి అపోహలుంటాయ్..! వాటిని అధిగమిస్తూ సరైన నిపుణుల సలహాలను పాటిస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.. మరింత కాలం గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు..’ అని ప్రముఖ హృద్రోగ నిపుణుడు అశోక్ సేథ్ అంటున్నారు.
 
 ‘మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా శారీరక శ్రమకు గురిచేసే బరువులు ఎత్తడం, జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చేయక్కరలేదు.. 45 నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ లేదా ఏరోబిక్ వ్యాయామం చేసినా చాలు మీ గుండె పదిలంగా ఉంటుంది..’ అని  ఆయన వివరిం చారు. ‘మహిళల్లో హృద్రోగం వచ్చే అవకాశాలు వచ్చే చాలా తక్కువనే ఆపోహలున్నాయి. నిజానికి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్లే చనిపోయే వారికంటే హృద్రోగంతో చనిపోయేవారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ..’ అని సేథ్ చెప్పారు. భారతదేశంలో మొదటి నుంచి మహిళల ఆరోగ్య విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది.. పురుషుడికి ఏమాత్రం నలతగా ఉన్నా వెంటనే వైద్యుడి దగ్గరకు పరిగెడతాడు.. అదే మహిళలు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా ఆస్పత్రికి పోయేందుకు ఇష్టపడరు.. వారిలో ఎటువంటి  శారీరక ఇబ్బందినైనా భరించే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యం పొందేందుకు సుముఖత చూపించరు..’
 
 సేథ్ వివరించారు. ‘ఎప్పుడైనా వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ క్యాన్సర్ కారక పరీక్షలు చేయించుకుంటా రు తప్ప ఎంతో అవసరమైన హృద్రోగ పరీక్షలు చేయించుకోరు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో హృద్రోగ నిపుణుడైన డాక్టర్ కె.కె.తల్వార్ మాట్లాడుతూ ‘మహిళల్లో ఉన్న ఈస్ట్రోజెన్ హార్మోన్‌లను వారికి ఉన్న కొన్ని అలవాట్లు (ఉదాహరణకు పొగతాగడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి) నశింపజేస్తుండటంతో హృద్రోగానికి గురవుతున్నారు. మెనోపాజ్ దశ దాటిన తర్వాత దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది..’ అని వివరించారు. ‘యుక్తవయస్కుల్లో హృద్రోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువనే అపోహ ఉంది.. 50 లేదా 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే హృద్రోగం వచ్చే అవకాశాలు ఎక్కువ అన్న విషయంలో నిజంలేదు.
 
 ప్రస్తుత జీవన విధానంలో జంక్ ఫుడ్, మద్యం, పొగతాగడం, ఒత్తిడి పెరిగిపోవడం తదితర కారణాల వల్ల 30 ఏళ్ల యువతలో కూడా హృద్రోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ’ని ఆయన వివరించారు. మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చే హృద్రోగ కేసుల్లో 20 శాతంవరకు 30-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అని తల్వార్ చెప్పారు. దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పాశ్చాత్య దేశాల యువతలో ఈ వ్యాధి పీడితుల సంఖ్య 5-10 శాతం తక్కువగానే ఉంది. ‘ఏంజియోగ్రఫీ చేయించుకోవడానికి వస్తున్న వారిలో 5-7 శాతం మంది 35 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం..’ అని చెప్పారు.
 
 ‘ఛాతీలో ఎడమవైపు వచ్చే అన్ని నొప్పులూ గుండెపోటుగానే పరి గణించనవసరం లేదు’ అని సునీత చౌదరి అనే హృద్రోగ నిపుణురాలు తెలిపారు. ‘ఫలానా బ్రాండ్‌కు సంబంధించిన వంట నూనె లు వాడండి.. మీరు గుండెజబ్బులకు దూరంగా ఉన్నట్లే..’ అని టీవీల్లో, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న ప్రకటనలను చూసి మోసపోవద్దని హృద్రోగనిపుణులు చెబుతున్నారు. ‘కొవ్వు సంబంధ పదార్థాలు గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.. వాటి కి దూరంగా ఉంటే చాలు.. మీ గుండె పదిలంగా ఉన్నట్లే’ అని తల్వార్ తెలిపారు. నిత్యం వంటల్లో ఒకే రకమైన బ్రాండ్ నూనెను వాడకుండా అప్పుడప్పుడు బ్రాండ్ మారుస్తుండటం మంచిదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ‘గుండె ఆరోగ్యానికి బాదం పప్పు, అక్రోట్ ఎంతో మేలు చేస్తాయి.. ప్రతిరోజూ నీటిలో 8-10 బాదంపప్పు గింజలను నానబెట్టి దానికి స్వీకరిస్తే మంచిది..’ అని సేథ్ వివరించారు.
 
మరిన్ని వార్తలు