ఎస్‌ఐ కుమారుడు చోరీల బాట

27 Apr, 2017 09:27 IST|Sakshi
ఎస్‌ఐ కుమారుడు చోరీల బాట
= ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి విక్రయాలు
= నలుగురి అరెస్ట్‌ 
 
బనశంకరి : తండ్రి బాధ్యయుతమైన పోలీసు వృత్తిలో ఉన్నాడు. కుమారుడు మాత్రం  చోరీలబాట బట్టాడు. కొంతమందిని చేరదీసి హాస్టళ్లలోకి చొరబడి ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తూ   పోలీసులకు పట్టుబడ్డాడు. ల్యాప్‌ట్యాప్‌ల చోరీ కేసులో హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కుమారుడు చేతన్ తోసహా నలుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 54 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.  

ఎస్‌ఐ కుమారుడైన చేతన్‌.. శరవణ, బషీర్, నవీన్ తో కలిసి ఆరునెలుగా  హాస్టల్స్, పీజీల్లోకి చొరబడి ల్యాప్‌ట్యాప్‌లు, సెలఫోన్లు చోరీ చేసేవారు. అనంతరం వాటిని అందంగా ప్యాక్‌ చేసి జేసీ రోడ్డు ప్రాంతంలో  విక్రయించేవారు. దొంగతనాలకు సొంత బైకులో వెళితే పట్టుబడతామనే భయంతో అద్దెకు బైక్‌లను వినియోగించేవారు. చోరీలపై కేసు దర్యాప్తు చేపట్టిన హెచ్‌ఏఎల్‌ పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి బైకు నంబర్‌ గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

అద్దె బైకు దుకాణానికి చేతన్ ఇచ్చిన సెల్‌నంబర్‌పై ఆరా తీసి మెజస్టిక్‌లో లాడ్జిలో నిద్రిస్తున్న చేతన్ ను బుధవారం వేకువజామున అరెస్ట్‌ చేశారు. విచారణ చేపట్టి మిగిలిన ముగ్గురిని  సైతం అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా చేతన్ రెండేళ్లుగా  ఇంటికి రాలేదని, ల్యాప్‌టాప్‌ చోరీల కేసులో పలుమార్లు జైలుకెళ్లి రెండు నెలల క్రితం జామీనుపై విడుదలై పాత ప్రవృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిసింది.  
 
మరిన్ని వార్తలు