సీఎంగా సిద్ధు అనర్హుడు

25 Nov, 2014 02:25 IST|Sakshi
సీఎంగా సిద్ధు అనర్హుడు

వెంటనే రాజీనామా చేయాలి : యడ్డి
శివమొగ్గ :  హై-క పరిధిలోని గుల్బర్గాలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించడాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థానానికి ఆయన అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సహకారంతోనే రాష్ర్ట అభివృద్ధి సాధ్యమని, అయితే ఈ విషయంలో సిద్ధరామయ్య పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

గతంలో గుల్బర్గాలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హైద్రాబాద్ కర్ణాటక అభివృద్ధికి కేటాయించిన నిధులు సద్వినియోగం కాలేదని, దీంతో గుల్బర్గాలో మంత్రి వర్గసమావేశం నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సిద్ధరామయ్య అభిప్రాయపడటం శోచనీయమని  ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఉన్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు.

 ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, లారీ లోడ్ ఇసుక రూ.25 వేల నుంచి రూ. 30 వేలు పలుకుతోందని అన్నారు.  ఇసుక, కంకర రవాణా చేస్తున్న వారిని జైలుకు తరలిస్తున్నారని, దీంతో ఈ దుస్థితి నెలకొందని వివరించారు. దీంతో భవన నిర్మాణ రంగం మందగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు తొమ్మిదో తేదీన  బెళగావిలో ప్రారంభమయ్యే అసెంబ్లీ  సమావేశ సమయంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.

మరిన్ని వార్తలు