‘మెట్రో’ వరం

21 Jul, 2016 01:51 IST|Sakshi

మహిళలకు ప్రత్యేక బోగి
అదనంగా మూడు బోగీల ఏర్పాటు

 
బెంగళూరు: నమ్మమెట్రో మహిళలపై కరుణ చూపింది. ఈమేరకు వారి సౌకర్యార్థం ప్రత్యేక బోగి కేటాయించనుంది. అదేవిధంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మూడు బోగీలతో నడుస్తున్న నమ్మమెట్రోకు అదనంగా మరో మూడు బోగీలు చేర్చనున్నారు. నమ్మ మెట్రోలో భాగంగా 18.10 కిలోమీటర్ల పొడవున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో (పీక్ హవర్స్) ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. సగటున ఈ మార్గంలో రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారంటే మెట్రోకు డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సంపిగేరోడ్-నాగసంద్ర మధ్య 12.4 కిలోమీటర్ల మార్గంలో కూడా సగటున రోజుకు 33 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో  మూడు కోచ్‌లతో నడుస్తున్న   అదనంగా మరో మూడు కోచ్‌లను చేర్చనున్నారు. అందులో  ఒకటి మహిళలకు కేటాయించనున్నారు. దీని వల్ల ప్రయాణికులు మరింత సౌకర్యవంతగా ప్రయాణించడమే కాకుండా సంస్థకు ఆదాయం కూడా పెరుగుతుందని నమ్మమెట్రో ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో ఇకపై రైలు అందుబాటు సమయం కూడా పెంచుతూ నమ్మమెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉదయం 7:15 గంటల నుంచి 8 గంటల వరకూ ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు, 8 గంటల నుంచి 10 గంటల వరకూ 6 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తుంది. శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 10 నిమిషాలకు ఒక రైలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ 8 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. కాగా, ప్రస్తుతం 10 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు