ప్రత్యేక రైళ్లు నడపనున్న ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్

28 Sep, 2013 23:06 IST|Sakshi
 న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా ఆ పార్టీ ఆదివారం వికాస్ ర్యాలీ పేరుతో నిర్వహిస్తున్న సభ కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50,000 మంది హాజరవుతారని భావిస్తున్నామని, ఇందుకోసం అద నంగా మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... ‘సాధారణంగా ఆదివారం మెట్రో రైళ్లను పూర్తిస్థాయిలో నడపం. 
 
 అయితే బీజేపీ నిర్వహిస్తున్న వికాస్ ర్యాలీకి పెద్దమొత్తంలో జనం తరలివస్తారని బీజేపీ నేతలు వివరించినందున వారి అభ్యర్థనమేరకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించాం. అంతేకాక ఫీడర్ బస్సులను కూడా నడుపుతాం. తొలిసారిగా టికెట్లు ఇచ్చేముందే రిటర్న్ టికెట్ కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రైళ్ల ఫ్రీక్వెన్సీని కూడా పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం రోహిణి నుంచి ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు ప్రతి ఐదు నిమిషాలకో రైలు సదుపాయం ఉండగా దానిని మూడు నిమిషాలకు తగ్గిస్తాం. 26 రైళ్లు రెడ్‌లైన్‌పై కూడా సేవలందిస్తాయ’న్నారు. 
 
 ఈ విషయమై గుప్తా మాట్లాడుతూ... ‘ర్యాలీకి తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని డీఎంఆర్సీని కోరాం. అందుకు ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ సానుకూలంగా స్పందించారు. స్టేషన్లలో జనం బారులు తీరకుండా ముందుగానే రిటర్న్ టికెట్ ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. రిటర్న్ టికెట్ ఇవ్వడం ఇదే ప్రథమం.  పశ్చిమ రోహిణి మెట్రో స్టేషన్-పనీస్ పార్క్ మధ్య ప్రత్యేక ఫీడర్ బస్సులను కూడా నడపనున్నట్లు చెప్పారు. స్టేషన్లో దిగినవారు నేరుగా సభకు వచ్చేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయ’న్నారు. 
 
మరిన్ని వార్తలు