'తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయండి'

22 Nov, 2016 16:30 IST|Sakshi
'తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయండి'

తమిళనాడు : తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు భాషను అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన లోకేశ్కు ఓ వినతి పత్రం సమర్పించారు.

ప్రపంచంలో తెలుగు భాష పరిరక్షణ, తెలుగు వారి పరిరక్షణ కాపాడేందుకు ఒక వేదిక ఏర్పాటుచేయాలన్నారు. నీటి సమస్యల లాగనే భాషా సమస్యలు కూడా వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాతృభాషలలో ప్రాథమిక విద్యాబోధనకు పార్లమెంట్లో బిల్లు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భంధ భాష చట్టం విధంగా కాకుండా విద్యార్థులందరికీ వారి మాతృభాషల్లో విద్యాబోధన జరపాలన్నారు.

తెలుగులోనే వ్యాపార సంస్థల బోర్డులు ఉండాలన్న నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టంగా అమలుచేయాలని చెప్పారు. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలలో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న తెలుగు విలేకరులకు రాయితీలు ఇప్పించాలన్నారు. తమిళనాడులో ఆంధ్ర సాంస్కృతిక భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయలని లోకేశ్ను జగదీశ్వరరెడ్డి కోరారు.

>
మరిన్ని వార్తలు