దమ్ముందా?

18 Sep, 2017 05:38 IST|Sakshi
దమ్ముందా?

►  రాజీనామా చేసి వస్తే తేల్చుకుందాం
►   పళని టీంకు దినకరన్‌ సవాల్‌
►  జయకుమార్‌ ఓ బఫూన్‌


చిన్నమ్మ శశికళ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వస్తే, ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం..! అని సీఎం పళని స్వామి  బృందానికి అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ సవాల్‌ విసిరారు. పదవి ఉంది కదా..? అని ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే, తానూ నోరు జారాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంత్రి జయకుమార్‌ ఓ బఫూన్‌ అని ఎద్దేవా చేశారు.

సాక్షి,  చెన్నై:  సీఎం పళని స్వామి శిబిరం, అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్‌ శిబిరం మధ్య మాటల తూటాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ శశికళను గురిపెట్టి మంత్రులు చేసిన ఆరోపణలకు ఎదురుదాడి సాగిస్తూ ఆదివారం దినకరన్‌ మీడియాతో మాట్లాడారు. దమ్ము, ధైర్యం అంటూ సీఎం పళని స్వామి, ఆయన మంత్రివర్గానికి సవాళ్ల మీద సవాళ్లు విసిరారు.

పళని అండ్‌కోకు సవాల్‌
అడయార్‌లోని నివాసంలో మీడియా ముందు కు రాగానే, దమ్ముందా...? అంటూ సీఎం పళని స్వామి, ఆయన మంత్రులకు సవాల్‌ విసురుతూ మాట దూకుడు పెంచారు. పదవులకు రాజీనామా చేసి,  శాసనసభా పక్షాన్ని సమావేశ పరిస్తే, అందులో నెగ్గేందుకు, మెజారిటీ నిరూపించుకునేందుకు ఆస్కారం కూడా లేని వాళ్లంతా, చిన్నమ్మను ఉద్దేశించి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. చిన్నమ్మ  ఇచ్చిన పదవుల్ని అనుభవిస్తూ, ప్రజా ధనాన్ని దోచుకుంటున్న  ఈ మంత్రులకు పుట్టగతులు ఇక కరువేనని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని ఆలోచించి, దమ్ము, ధైర్యంపై చర్చించి నిర్ణయానికి రండి అని సవాల్‌ విసిరారు. కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి అరెస్టుతో పళని, పన్నీరులకు గతంలో ముచ్చెమటలు పట్టాయని, ఇప్పుడు అదే భయంతో అమ్మ ప్రభుత్వాన్ని మరొకరికి తాకట్టు పెట్టి ఉన్నారని మండిపడ్డారు.

అమ్మ మరణానికి చిన్నమ్మే కారణం అని వ్యాఖ్యానిస్తున్న వాళ్లు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పదవులు చేతిలో ఉన్నాయి.. కదా.. అని ఇష్టానుసారంగా ఆరోపణలు, బెదిరింపులు చేస్తే, తానూ నోరు జారాల్సి ఉంటుందని, అన్నీ బయట పెట్టాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు చేశారు. మంత్రి జయకుమార్‌ ఓ బఫూన్‌ అని ఈసందర్భంగా ఎద్దేవా చేశారు. తనను దొంగ అని వ్యాఖ్యానించే ముందు, ఆయన తాహతు ఏమిటో అన్నది ఓ మారు గుర్తుకు తెచ్చుకుని ఉండాలని మండి పడ్డారు.

చిన్నమ్మతో ములాఖత్‌
పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళతో ములాఖత్‌కు దినకరన్‌ నిర్ణయించారు. మైసూర్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి జైలుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అలాగే, పళనికి వ్యతిరేకంగా ఉన్న, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని చిన్నమ్మ సమక్షంలో హాజరుపరిచేందుకు దినకరన్‌ కుస్తీ పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఆ శిబిరానికి చెందిన ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌ వ్యాఖ్యానించారు. 20వ తేదీ జరిగే ములాఖత్‌ సమయంలో మరి కొందరు ఎమ్మెల్యేలు తమవైపునకు తప్పకుండా వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, చిన్నమ్మ శిక్ష అనుభవిస్తున్న చెరలో జైలు వర్గాలు ఆగమేఘాలపై తనిఖీలు నిర్వహించి ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు