స్వైన్‌ఫ్లూతో మొత్తం ముగ్గురి మృతి

7 Jan, 2015 23:02 IST|Sakshi

న్యూఢిల్లీ: నగరంలో బుధవారం మూడో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), స్థానిక ఆరోగ్య శాఖలు సమీక్షించాయి. ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. ఇక జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిధిలోని ఫరీదాబాద్‌లోనూ మరొకరు మరణించారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గత నెల 26వ తేదీన సర్ గంగారాం ఆస్పత్రిలో 51 ఏళ్ల వ్యక్తి మరణించిన విషయం విదితమే. కాగా ఈ ఏడాది నగరంలో మొత్తం స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
 
 ఈ ఘటన నేపథ్యంలో  నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), స్థానిక ఆరోగ్య శాఖలు నగరంలో తాజా పరిస్థితిని సమీక్షించాయి. అనంతరం స్థానిక ఆరోగ్య శాఖ అధికారి చరణ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధి నియంత్రణపై కొన్ని ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ప్రతి సిబ్బందికీ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇదిలాఉండగా బుధవారం ఒక్కరోజే ఎనిమిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మహిళలు కాగా ఐదుగురు పురుషులు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధిబారినపడిన వారి సంఖ్య 22కు చేరుకుంది. వ్యాధిపీడిత మహిళలు మదన్‌గిర్ ప్రాంతానికి చెందినవారిగాను, పురుషులు...చత్తర్‌పూర్, రాజౌరీ గార్డెన్, లక్ష్మీనగర్, మస్జీద్ మోత్, జేఎన్‌యూ క్యాంపస్ ప్రాంతవాసులుగాను గుర్తించారు. వీరికి వైద్యులు నిరంతర సేవలందిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు