ఉల్లాసంగా రావణ దహనం

14 Oct, 2013 04:52 IST|Sakshi
న్యూఢిల్లీ: తేలికపాటి జల్లులు నగరవాసుల ఉత్సాహాన్ని ఎంతమాత్రం నీరుగార్చలేకపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పది తలల రావణాసురుడితోపాటు మేఘనాధుడు, కుంభకర్ణుల దిష్టిబొమ్మలను ఆదివారం దగ్ధం చేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వేలాది మంది నగరవాసులు తరలివచ్చారు. దీంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా నగరవాసులు కొత్త దుస్తులు ధరించి నగరంలోని వివిధ రాంలీలా మైదానాలకు వచ్చారు.
 
 నగరం నిండా దానవ రూపాలే
 మనిషిరూపంలో దానవులు సంచరించే మాటెలా ఉన్నా దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో అడుగడుగునా దానవ రూపాలు కొలువుదీరి కనిపించాయి. రాంలీలా ఉత్సవాల కోసం తయారై సిద్ధంగా ఉన్న దానవ మూర్తులు రావణ, కుంభకర్ణ, మేఘనాథ్‌ల దిష్టిబొమ్మలు బాటసారులను కట్టిపడేశాయి. రాక్షస రాజులు రావణసూరుడు, కుంభకర్ణుడు, మేఘనాథ్‌ల విగ్రహాలను రాంలీలా ఉత్సవాల్లో భాగంగా దహనం చేయడం జనాచారంగా కొనసాగుతోంది. 
 
 తరాలుగా దానవేంద్రుల విగ్రహాల తయారీలో కొనసాగుతున్న తితార్‌పూర్ కళాకారుడిని ప్రశ్నించగా ‘‘దానవ విగ్రహాల్లో అన్నింటికంటే ఎత్తైది రావణాసురుడిది. ఇది విజయ దశమి రాత్రి రాంలీలా మైదానంలో దహనమైపోతుంది. విగ్రహాల ఎత్తు ప్రమాణంగా కుంభకర్ణుడు, మేఘానాథ్, రావణులకు మధ్య తేడా చూపిస్తాం’’ అని వివరించాడు.
 
 నడి రోడ్డుపై ప్రదర్శనగా ఉంచిన విగ్రహాలను గురించి ప్రస్తావించగా కళాకారుడు రాజేందర్ మాట్లాడుతూ ‘‘గత వారం విగ్రహాలు తయారీ పూర్తవుతున్న సమయంలో వర్షం కురవడంతో తడిసి పోయాయి. రంగులు వేసి ఆరడం కోసం రోడ్డు మధ్య నిలిపి ఉంచాం. రాంలీలా ఉత్సవాల కోసం రెండు నెలలు రాత్రింబవళ్లు కష్టపడతాం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి 35 మంది కళాకారులను ఇందుకోసం పిలిపించుకుంటాం’’ అని ఆయన వివరించాడు. రాజేందర్ ఈ విగ్రహాల తయారీ  40 ఏళ్లుగా చేస్తున్నాడు. ఈసారి దానవమూర్తుల విగ్రహాలకు భారీ గుబురు, వంకలు తిరిగిన పొడవాటి మీసాలను అలంకరించాం. రెండు తలల విగ్రహాలకు ఈసారి డిమాండ్ పెరిగింది.  సుమారు 50 అడుగుల ఎత్తయిన విగ్రహాలను రూ. 7 నుంచి 8 వేల ఖరీదుతో విక్రయించారు.
 
మరిన్ని వార్తలు